కప్ప వైద్యుడు
రాసినది జ్యోతి పై జూన్ 28, 2007
ఇది పాతికేళ్ళ క్రిందటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది. ఎవరు రాసారో తెలీదు మరి….
అనగనగా ఒక కప్ప
అది తానొక గొప్ప
వైద్యుడని భావించింది
వైద్యం చేస్తానని చాటించింది.
అడవికి వెళ్ళిందా కప్ప
అమాంతంగా ఒక గొప్ప
వైద్యుడైనట్టు తన మెప్పు
చాటింది (బెక బెకల డప్పు).
అరణ్యమృగాలీ చోద్యం
చూశాయి “సెబాస్, వైద్యం
చేసే తమాషా కప్ప
ఎక్కడా చూడలేదప్ప!”
అనుకున్నాయి జంతువులు పాపం.
“నిజంగా ఈ కప్పరూపం
ధరించిన వైద్యు“డని మృగాలు
నమ్మాయి కప్పగప్పాలు!
అయితే ఒక నక్క మాత్రం
’కప్పేమిటి? వైద్యమేమిటి?’ చిత్రం
ఇందులో ఎదో మోసం
ఉండాలి ముప్పాతిక మువ్వీసం!’
అనుకుని వెళ్ళింది కప్ప
దగ్గరికి నక్క ఒక పెంటకుప్ప
కన్నా అసహ్యంగా ఉన్న
ఈ కప్ప వైద్యుడా! సున్న!
తెలిసింది నక్కకి భేషజం
“చూడు కప్పా! ఔషధం
ఇస్తావా జబ్బులన్నిటికీ!”
అని నక్క అడిగినప్పటికి
” ఓ! దానికేం! నేను చాలా
ఘన వైద్యుణ్ణి, సృగాలా
గ్రణి! నీ కొచ్చిన రోగం
ఏదైనా కుదురుస్తా వేగం!”.
అని కప్ప అన్నాదో లేదో
వెంటనే నక్క “నీకేదో
జబ్బుంది! లేకుంటే ఒళ్ళంతా
ఆ మచ్చలఏమిటి? కాళ్ళంతా
ఏమిటా వంకర టింకరలు!
ముందు నీకున్న కొంకరలు
మాన్పుకో ఆ పిదప నా యొక్క
జబ్బు సంగతి చూదా“మంది నక్క.
సిగ్గొచ్చింది కప్పకి
తక్షణం తప్పుకుంది పక్కకి
చేతగాని బడాయి లెందుకని
వెళ్ళిందింటికి తలదించుకుని
“తనకున్న రోగం తానే
నయం చేసుకోలేనే
లేనట్టి వైద్యుడేలాగు
ఇతరులకు మందియ్యజాలు!”