నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఈ రచన నేను కొత్తపాళిగారితో కలిసి పొద్దు కోసం చేసింది…

ఆకలి రుచెరుగదు అని సామెత చెప్పిన మన పూర్వులే పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ

అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? మామూలు మానవమాత్రుల సంగతే ఇలాగుంటే నిజంగానే

మరి కోటి విద్యలు నేర్చిన మహా విద్వాంసులు, స్తుతమతులైన ఆంధ్ర కవులు , మన

తెలుగు కవిధూర్జటుల సంగతి వేరే చెప్పాలా?

 

 

అప్పడుపు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి?” అని తృణీకరించటం

పోతనగారికి చెల్లింది గానీ .. హాలికులైనా, ( శ్రీశ్రీ మాటల్లో) ఆల్కహాలికులైనా మన కవులు

భోజనం దేహి రాజేంద్ర, ఘృతసూప సమన్వితం అంటూ తమ కవిత్వంలో భోజనానికి

పెద్దపీటే వేశారు. బ్రాహ్మణో భోజన ప్రియః అని ఎవరన్నారో గానీ , ఆ విషయంలో మాత్రం

మన కవులంతా సద్బ్రాహ్మణులే!

ఏమాట కామాట చెప్పుకోవాలి, మనవాళ్ళు సుష్టుగా భోజనం చెయ్యడంతో తృప్తిపడి

ఊరుకోలేదు. ఏ రుచి ఎలా వస్తుందీ అని వంట మీద కూడా తమ దృష్టిని నిలిపారు .

 

పదనుగ మంచి కూర నలపాకము జేసిననైన గాని నిం

పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా

 

అని భాస్కర శతకకారుడు ఉప్పుని ఆకాశానికెత్తితే, అన్నన్నా అంటూ కొరవి గోపరాజు గారు

 

గరిత లేని యిల్లు దొర లేని తగవును

చింత పండు లేని వింత చవియు

చనువులేని కొలువు శశిలేని రాత్రియు

ముక్కులేని మొగము నొక్క రూపు 

 

 – ఇలా చింతపండుని సింహాసన మెక్కించారు.

 

కవిసార్వభౌముడైన శ్రీనాథుడు వీటన్నటినీ వదిలి పెట్టి ఏకంగా నరమాసం ఎలా వండాలో

చెప్పాడు చక్కటి చంపకమాలలో తన హరవిలాసం కావ్యంలో భక్త శిరియాళుడి కథ

చెబుతూ.

 

మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకర్ర శ

ర్కరమును చింతపండును గరాంబువు కమ్మని నేయి తైలమున్

పెరుగును మేళవించి కడుపెక్కు విధంబుల పాక శుద్ధి వం

డిరి శిరియాళునిం గటికి డెందమునం దరలాక్షులిద్దరున్ !!

 

కాకపోతే దీని రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాయాబజారులో ఘటోత్కచుడి

అనుచరులైన లంబూ జంబూలని ఆశ్రయించాల్సిందే.

 

కొండవీటి సీమలో సకల వైభోగాలనుభవించిన శ్రీనాథుడు విధి వశాత్తూ దేశాటనం

చెయ్యవలసి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన్ని అన్నిటికన్నా

బాధించింది ఆయా సీమల వింత రుచులు, భోజనపు అలవాట్లు. ఆయన హాస్యమూ,

అపహాస్యమూ, కోపమూ  .. అన్నీ మంచి రసవంతమైన పద్యాలుగా జాలువారాయి

ఎంతైనా కవిసార్వభౌముడు కదా! పల్నాటి సీమని చూసి రసికుడు పోవడు

పల్నాడుఅని మొదలెట్టి, “ కుసుమాస్త్రుండైన (మన్మథుడైనా) జొన్న కూడే

కుడుచున్అని నొసలు చిట్లించాడు. చల్లా యంబలినీ ఉడుకు బచ్చలి శాకాన్నీ

తట్టుకోలేక పూతన చన్నుల విషాన్ని పీల్చేసిన బాలకృష్ణుణ్ణే సవాలు చేశాడు,

దమ్ముంటే ఇది తినమని.

 

ఒకసారి ఖర్మకాలి ఎవరో అరవాయన ఈయన్ని భోజనానికి పిలిచాడుదానికిదీ

పర్యవసానం!

 

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు

చెవులలో పొగవెళ్ళి చిమ్మిరేగ

పలు తెరంగులతోడ పచ్చళ్లు చవిగొన్న

బ్రహ్మరంధ్రము దాక పారునావ

యవిసాకు వేచిన నార్నెల్లు పసిలేదు

పరిమళమెంచిన పండ్లు సొగచు

వేపాకు నెండించి వేసిన పొళ్ళను

కంచాన గాంచిన కక్కు వచ్చు

అరవ వారింట విందెల్ల నాగడంబు

చెప్పవత్తురు తమ తీరు సిగ్గులేక

చూడవలసెను ద్రావిళ్ళ కీడు మేళ్ళు !!

 

ఇక చివరికి గౌడ డిండిమ భట్టుని జయించటానికి కర్ణాటక రాజ్యానికి వెళ్ళినప్పుడు

వడ్డించిన నువ్వులపొడి ఘాటు భరించలేక చేతులెత్తేసి వెల్లుల్లిన్ తిపివిష్టమున్

మెసవితిన్ విశ్వస్థ వడ్డింపగా .. చల్లా యంబలి ద్రావితిన్ .. తల్లీ కన్నడరాజ్య

లక్ష్మీ! దయ లేదా! నేను శ్రీనాథుడన్ !” అని మొరబెట్టుకున్నాడు, పాపం.

మొరలో కూడా ఎంత గీర!

 

ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో తిన్నడి ఎంగిలి మాంసము తిన్న శివుణ్ని

ఇలా ప్రశ్నిస్తాడు. చమత్కారం తిలకించండి.

 

నీకున్ మాంసము వాంఛయేని కఱవా ! నీ చేత లేడుండగా

జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండగా

పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపకా బోయ చే

చే కొంటెంగిలి మాంసమిట్లు దగునా ? శ్రీకాళహస్తీశ్వరా!!

 

లేడి, దాన్ని చంపడానికి గొడ్డలి, మాంసం ఉంచటానికి గిన్నెలాంటి పుర్రె , ఉడికించటానికి

నీరు,నిప్పు అన్నీ నీ దగ్గరే వున్నాయి కదా బోయవాడి ఎంగిలి మాంసమెందుకు

తిన్నావని ధూర్జటి ప్రశ్న ఇలా వెక్కిరిస్తున్నట్టు చేసే పొగడ్తని నిందాస్తుతి అంటారుట.

 

ప్రబంధకవులిలా రెచ్చిపోతుంటే పదకవులా ఊరుకునేది ?

తెవులు బడిన వాడు తినబోయి మధురము

చవిగాక పులుసులు చవిగోరినట్లు”  – అని ఉపమించాడు పదకవితా పితామహుడు.

జ్వరమొచ్చిన వాడికి తియ్యటి పాయసం ఎలా సహిస్తుంది వాడి నోటి చేదుకి వాడు

పులుసుల్నే కోరుకుంటాడు. అట్లాగే తియ్యటి నీ నామాన్ని మరచి మేము ఈ సంసార

లంపటాన్ని కోరుకుంటున్నాము ప్రభో అని తాళ్ళపాక అన్నమయ్య రోగనిర్ధారణ చేశాడు.

 

ఇదే ధోరణిలో భద్రాచల రామదాసు శ్రీరామ నీనామ మేమిరుచిరాఅని పాడాడు. అంతే

కాదు, “పాలు మీగడలకన్నా, పంచదార చిలకల కన్నాఅని కొసరు వేశాడు. త్యాగరాజ

స్వామి ఇంకో మెట్టు పైకెక్కి స్వరరాగలయ సుధారసమందు వరరామ నామమనే ఖండ

శర్కర మిశ్రము చేసి భుజియించమన్నారు.

 

ఆగండాగండి, వడ్డించాల్సిందింకా చాలా ఉంది, అప్పుడే స్వీట్లలోకి రావట్లేదు.

ఆహార వ్యవహారాల్లోఅంటాం కదా .. అక్కడ కూడా ఆహారందే అగ్రతాంబూలం.

అసలు విషయమేవిటంటే వంట , భోజనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్గత

భాగాలు. మన ప్రాంతం, కుటుంబ ఆచారాలు, మన స్థితిగతులు ఇవన్నీ మన

ఆహారపు అలవాట్లని ప్రభావితం చేస్తాయి. ఆముక్తమాల్యదలో గోదాదేవి తండ్రియైన

విష్ణుచిత్తుడు అనుదినం వైష్ణవులకు భోజనాలు పెడుతూ వారి సేవచేస్తుంటాడు.

భోజన వైభవం వర్ణించటానికి రాయలవారికి ఒక పద్యం చాలక ఏకంగా నాలుగు

పద్యాల్లో వర్ణించాడు. వానాకాలంలో కట్టెలు మండవనీ, పొగరాకుండా వంట చేసేందుకు

 స్త్రీలు ఎండు కొబ్బరిడెక్కల్ని ఉపయోగిస్తారనీ రాయలవారికెలా తెలిసిందో .

 

ఇంతకీ ఏమి వడ్డించారయ్యా అంటే

“……..  …….  ……. కలమాన్నము , నొల్చిన ప్రప్పు , నాలుగే

న్బొగిపిన కూరలున్ , వడియముల్, వరుగుల్, పెరుగున్, ఘృతప్లుతిన్.”

వరి అన్నం , పొట్టుతీసి వొండిన పప్పు, నాలుగైదు పోపు వేసిన కూరలు .. ఇలా .. 

పెరుగుని కూడా నేతిలో ముంచారా ఏవిటని సందేహం వెలిబుచ్చితే, ” మాత్రం

ఇంగితం ఉండక్కర్లేదూ! పెరుక్కి ముందు వాటికి మాత్రం ఆ చివరి ఘృతాన్ని

అన్వయించుకోవాలని శలవిచ్చారు మా ఆచార్యులవారు . సరే కానివ్వండి.

 

పోపంటే గుర్తొచ్చిందండీ .. ఇటీవలి కవి మన కరుణశ్రీ గారు అన్నారు

అమ్మ నీచేతి తాలింపు కమ్మదనము భరతదేశాన ఘుమఘుమా పరిమళించె“.

పోపు లేనిదేమి వంటండీ ? ఆఖరికి చారు పెట్టుకున్నా అందులో పోపు వేసుకోవాలి

కదా. అందుకే కాబోలు ఎవరో అన్నారు పోపు పెడితే పొలిమేర దాకా ఘాటు

రావాలి అని

 

ఎట్లాగూ కాలపు కవులని కూడా తల్చుకున్నాం కదా, కాసేపు అవధానాల్లోకి

తొంగి చూద్దాం . ఈ అవధానపు పృఛ్ఛకులుంటారే .. వాళ్ళకి నిజంగానే కాదేదీ

కవితకనర్హంఅనిపిస్తుంది కాబోలు. తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళని

పట్టుకుని చిలకమర్తి వారు పకోడీ మీద పద్యం చెప్పమన్నార్ట వీళ్ళేనా తక్కువ

తినేది?

 

శనగపిండి ఉల్లిపాయ చిన్ని మిర్పకాయలన్

జునిపి అందు అల్లమంత దొనిపి ముద్దచేసినన్

అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్

జను పకోడి అనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!

 

దోరగా వేగిన చిట్టిపకోడీ లాంటి పద్యం మనముందుంచారు .

 

ఒక గడుగ్గాయి పృఛ్ఛకుడెవరో దత్తపది అనే అంశంలో అంబలి, చింతకాయ , కూరగాయ,

పాల నేతి నాలుగు తెలుగు మాటల్ని ఉపయోగించి సంస్కృత శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి

స్తుతించమంటే అవధానిగారి సమాధానమిది.

 

అంబలి ద్వేషిణం వందే (అం + బలి = బలిని అణచినట్టి)

చింతకాయ శుభప్రదం (నిను చింతించువారికి శుభాలనిచ్చేటి)

కూరగాయ కృతత్రాసం ( కు+ఉరగాయ = చెడ్డపాముని, కాళీయుణ్ణి మర్దించిన)

పాలనేతి గవాం ప్రియం !! ( అవుల్ని కాయటం ఇష్టమైన శ్రీకృష్ణునికి వందనం!!)

కృష్ణుడి మీద స్తోత్రం సంగతేమో గానీ ఇది మాత్రం తినుబండారాల శ్లోకం.

 

నేటి హోటళ్ళ మీద కూడా చమత్కారాలు ఎన్నో పుట్టుకొచ్చాయి . హోటళ్ళ గురించి

నవ్వుల పువ్వులుకావ్యంలో ఇలపాపులూరి సుబ్బారావుగారొక పద్యం రాసారు .

 

వింతగ హోటలందొకట ప్రీతిగమే మిడినంత” ” మీరు

తిన్నంతయనంగ వ్రాతలును అందుకు తగ్గట్టు రేట్లు రెండు మూ

డింతలు వేయ జూచి గిరి ఏమిటిది?” చెప్పుమటన్న సర్వరొ

క్కింత హసించి ప్లేటు” ” ఫులు ” – ఇంగ్లీషు మాటల యర్ధమే యనెన్.

 

ఒక హోటల్ ముందు విచిత్రమైన బోర్డు పెట్టారు. దాని మీద ప్రీతిగ మేమిడినంత

అంటే వాళ్ళు పెట్టినంత , అదేనండి ప్లేట్ మీల్స్, మీరు తిన్నంత అంటే మనం

తిన్నంత అదే ఫుల్లు మీల్స్ అని తెలుగు భాషాభిమాని అయిన హోటల్ యజమాని

రాయించి వేరు వేరు ధరలు పెట్టి జనాల్ని కొద్దిగా తికమక పెట్టారుట.

 

తృప్తిగా వడ్డించినట్టే లేదు, ఇంకా రుచి చూడవలసినవి చాలా ఉన్నాయి , మీరేమో అప్పుడే

భుక్తాయాసం అంటూ చెయ్యి కడుక్కోవడానికి లేస్తున్నారు. సరే కానివ్వండి . మరోమాటు

మా సాహితీ షడ్రుచుల విందుకి తప్పక రావాలి సుమండీ! ప్రస్తుతానికి రమణీప్రియ

దూతిక యిచ్చే కప్పురపు విడెంఉంటే గాని పద్యం పలకదన్న పెద్దన గార్ని తల్చుకుని

శలవు పుచ్చుకుంటాము.

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: