నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అక్షయపాత్ర

                                         11.jpg 

వాహనం వస్తున్న శబ్దం వినిపించగానే గణగణమంటూ గంట మోగుతుంది. విద్యార్థులంతా చేతిలో పళ్ళెం పట్టుకుని వరుసలో నిలబడతారు. టీచర్లు వేడి వేడి అన్నం, నోరూరించే కూర, ఘుమఘుమలాడే సాంబారు, చిక్కటి పెరుగు పళ్ళెంలో వడ్డిస్తారు. పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ కడుపునిండా తింటారు. మద్యాహ్న భోజనం ఐదులక్షల మంది బడి పిల్లల జీవితాల్ని మార్చింది. పేదరికంతో వచ్చిన పోషక విలువల లోపాల్ని పారదోలింది. ఆకలితో పుట్టిన నిర్లిప్తతను దూరం చేసింది.వారిప్పుడు  చదువుల్లో ముందు. ఆటల్లోనూ ముందే! “చదువుకోవడానికి ఆకలి అవరోధం కాకూడదుఅన్న లక్ష్యంతో ఇస్కాన్ ప్రారంభించిన పధకం అక్షయపాత్ర 

                                         51.jpg

ఎంతో మంది పేద విద్యార్థులను అందునా చిన్నారులను వేధిస్తున్న సమస్య ఆకలే! రాక్షసిలాంటి ఆకలి.. దయ్యంలా వెంటాడి వేధించే ఆకలి. స్కూల్లో శ్రద్ధగా పాఠాలు విందామంటే కడుపులోని పేగులు అరుపులతో ఇబ్బంది పెట్టేవి. బోర్డు మీదున్న జవాబుల్ని పుస్తకంలో రాసుకుందామంటే బైర్లు గమ్మేవి..కళ్ళు సహకరించేవి కావు. పాఠం విన్నా ఆకలే ముందు గుర్తొచ్చేది పిల్లలకు. బడిగంట కొట్టాక ఇంటికెళ్ళినా పేగులు నోరు మూసుకునేవి కావు. కడుపునిండా అన్నం పెట్టకపోతే అవి మాత్రం ఏం చేస్తాయి. రాత్రికి అమ్మ ఇచ్చిన గంజినీళ్ళు తాగి బలవంతాన నిద్రపోవడమే. మేల్కొని ఉంటే ఆకలేస్తుంది. నిద్రలో అయితే సంగతే గుర్తుండదు. 

 

ఆకలే తమ శత్రువని పిల్లలకు అర్ధమైపోయింది. అంత పెద్ద శత్రువును జయించగల శక్తి వారికెక్కడుంది. అసలే పసివారు.ఆపై అర్భకులు. దేవుడు ప్రత్యక్షమైతే ఎంత వడ్డించినా అన్నం పుట్టుకొచ్చే అక్షయపాత్ర అడగాలని పిల్లలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. దేవుడు ప్రత్యక్షం కాలేదు గాని ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ) అద్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధి వచ్చి పిల్లలకు రోజూ మద్యాహ్నం కడుపునిండా అన్నం పెడతామని చెప్పారు. పథకం పేరు అక్షయపాత్ర

                                         31.jpg 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలోని రెండు వేల పాఠశాలల్లో చదివే ఐదు లక్షలమంది చిన్నారులు అక్షయపాత్రలోని అన్నం తింటున్నారు. ఆకలి వారితో రాజీకొచ్చింది. మీ జోలికిరాను బుద్ధిగా చదువుకోండి.అని చెప్పి తన దారిన తాను వెళ్ళింది.వాళ్ళకిప్పుడు క్లాసులో రోజూ ప్రశంసలే. ప్రతి పరీక్షలో మంచి మార్కులే. పళ్ళెంనిండా   అన్నం ఉన్నప్పుడు ఆకలనిపించదు. తినడానికి ఉందన్న ధైర్యంతోనే సగం కడుపు నిండిపోతుంది. “అక్షయపాత్ర భరోసా ఇచ్చింది.

 

ఒకసారి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదస్వామి ఎదో గ్రామానికి వెళ్ళినప్పుడు  ఎంగిలి విస్తరాకులలో అన్నం మెతుకుల కోసం కుక్కలతో పోటీపడి తింటున్న చిన్న పిల్లలను చూసి హృదయం ద్రవించి  పథకానికి ఆలోచన చేసారు. అక్షయపాత్ర ద్వారా ఒక్కో విద్యార్థి భోజనం ఖర్చు ఆరు రూపాయలు దాకా అవుతుంది. దీని ప్రకారం రోజువారీ వ్యయం ముప్పైలక్షల పైమాటే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  పథకానికి కొన్ని నిధులు ఇచ్చాయి.కాని అవి మూలకు సరిపోతాయి. అయినా పనిని సంతోషంగా స్వీకరించింది ఇస్కాన్. “మన దేశంలో పసివాడు ఆకలితో మాడిపోకూడదు. ఆకలి చదువులకు అడ్డంకి కాకూడదుఅన్నదే సంస్థ ఆశయం.

                                          61.jpg

దాన్ని సాధించడానికి ఎన్నో కార్పోరేట్ సంస్థలు సాయమందిస్తున్నాయి. తొలి స్పందన ఇంఫోసిస్ ఫౌండేషన్ అద్యక్షురాలు సుధామూర్తి. ఉత్తరప్రదేష్‌లోని మధురలో భారతీ టెలివెంచర్స్ అక్షయపాత్ర కు అండగా నిలుస్తుంది. సత్కార్యంలో భాగస్వాములు: ఎన్ జెడ్ తెక్నాలజీ, అశోక్ లేలాండ్, ఓఏన్‌జిసి, ఫిలిప్స్, యూబీ గ్రూప్, యాక్సెంచర్ మొదలగునవెన్నో కార్పోరేట్ సంస్థలు  అన్నదానానికి తోడు నిలుస్తున్నాయి.

                                         41.jpg

మద్యాహ్నాలు కడుపారా భోంచేస్తున్న పిల్లల సంఖ్య ఇంకో మూడేళ్ళ తర్వాత పది లక్షలకు చేరుతుంది. అలా మెల్లమెల్లగా పేదరికం కారణంగా బడికి దూరంగా ఉన్న దాదాపు నాలుగున్నర కోట్ల మంది పిల్లలకు చేరుతుంది. ఇది ఇస్కాన్ విజన్.  కల  నెరవేరాలంటే మరింత మంది ముందుకు రావాలి. చాలా నిధులు కావాలి. ఒక వ్యక్తి అందరికి సాయం చేయలేకపోవచ్చు. కానీ అందరూ కలిసి మంచిపనికి సాయపడవచ్చు. కలాం సలహా కూడా అదే. కనీసం నెలకు పదివేలు సంపాదిస్తున్నవారు ఒక విద్యార్థి ఏడాది భోజనం ఖర్చులను భరించడం కష్టమేమీ కాదు.కాస్తో కూస్తో స్థోమత ఉన్నవారికి ఏడాదికి పన్నెండు వందలు లెక్కలోకి రావు. తమ బిడ్డల పుట్టినరోజు వేడుకల ఖర్చు, ఇతర విందులూ వినోదాలతో పోలిస్తే అదో పెద్ద మొత్తమే కాదు కానీ సొమ్ము నిరుపేద విద్యార్థికి ప్రాణం నిలిపే అన్నంపరబ్రహ్మ స్వరూపం.

                                          21.jpg

పథకానికి అభయహస్తం అందించాలనుకునేవారు బెంగుళూరులోని అక్షయపాత్ర ఫౌండేషన్ కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు.  080-23578622, 23471956

 

ఇది ఈనాడు పత్రిక, టీవీలో వచ్చిన కార్యక్రమమునుండి సేకరించిన సమాచారం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: