నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for అక్టోబర్, 2007

ఔరా పిల్లలు !!!!

ఈ రోజుల్లో పిల్లలు చెడిపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. చూస్తున్నాము కూడా. కాని మా పిల్లలతో జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే నాకు ఆశ్చర్యమెస్తుంది. ఔరా నేటి తరం ఎంతా ఎదిగిపోయింది అని.

కొన్ని రోజుల క్రింద ఒక ఇంటర్వ్యూ ప్రశ్న అడిగా మా పిల్లలిద్దరిని.

ఒక చల్లని సాయంత్రం రమేష్ తన బైక్‌పై వెళుతున్నాడు . అలా వెళుతుండగా ఒక బస్‌స్టాపులో  ఒక ముసలావిడ జ్వరంతో ఉంది, అతని గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ సతీష్ ఉన్నారు. అప్పుడూ రమేష్ ఏం చేయాలి?? అందరినీ సంతోషపరచాలి ..ఆ రమేష్ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావ్??

అసలు సమాధానం ఐతే అతను బైకును తన ఫ్రెండ్‌కిచ్చి ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని అతను అక్కడే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తాడు.

మా అమ్మాయి మాత్రం ఇదే సమాధానం  చెప్పింది. కాని మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా.తనే ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్తానని. నేనడిగా  అలా ఐతే నీ గర్ల్‌ఫ్రెండ్,బెస్ట్ ఫ్రెండ్‌కి న్యాయం చేయట్లేదు కదా.బైకు సతీష్‌కిచ్చి ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని, హాయిగా గర్ల్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లేసుకోవచ్చుగా. వాడంటాడు. “తొక్కల గర్ల్‌ఫ్రెండ్!! ముందు ఆ ముసలావిడ ఆరోగ్యం ముఖ్యం కదా.ఐనా నా క్లోజ్ ఫ్రెండ్ ఐనంత మాత్రాన నా బైక్క్ ఇచ్చి వెళ్ళమంటే వాడు ఆ ముసలావిడను తీసికెళ్ళకుంటే, నా బైక్ తీసుకుని ఊరంతా తిరిగి మళ్ళీ రాకుంటే. సో నేను అలా చేయను. ఐనా ఈ అమ్మాయిలకు అంత ఇంపార్టెన్స్  ఎందుకివ్వాలి అంటాడు వెధవ. ఒక సంగతి చెప్పనా… అందరు అమ్మాయిలు అబ్బాయిలతో ఖర్చు పెట్టిస్తే , మావాడు మాత్రం అమ్మాయిలనే ముంచేస్తాడు. వాళ్ళనే ఖర్చు పెట్టించి. కాలేజిలో ఐనా, ఇప్పుడు  ఉద్యోగంలో ఐనా!! ఏం చేయను వాడితో??? 

బాగుపడతాడా??  

గోదావరి…

నిన్న నా పాత పుస్తకాలు అన్ని సర్దుతూ ఉంటే పాతికేళ్ళ క్రింద ఒక వార పత్రిక నుండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పాట దొరికింది… నా బ్లాగులో పెట్టేసి దాచుకుంటూ మీ అందరితో పంచుకుంటున్నాను…… 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

గోదావరీ దేవి గుండె జలజలలాడా

అదగొని మనసు కదలాడి జాలి

పొదులో పెల్లగిలి పూడి కిన్నెరా

గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలలో

చాదుకొని పెనుతరంగ లూగే వాగు

నాదుగొన యామెవగ సాగే

 

గోదావరి జాలి గుండె గూడులు కదలి

సాదు కిన్నెర కెదురుపోయీ.. ఆమె

లోదిగులు తరగ చేదోయీవారించి

అదరముచే నామె నదిమి గౌగిట బూని

ఏది నీ మొగము నా తల్లీఅన్నదీ

నీ దిగులు నికమాను చెల్లీ

 

గోదావరి పేదగుండె లోతులు కలగి

రాదగ్గరకు రమ్ము తల్లీ ఎంత

సాదువే నా ముద్దు చెల్లీనీ వెన్ని

రాదగని కష్టాల రాశి మ్రగ్గితినమ్మ

నీదు పతి శిలరూపు పొందీ .. నీవేమో

ఓదె వనవాగుగా చిందీ

గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి

నీ దుఃఖమెంతదో తల్లి నిన్ను

నాదరువుగా నమ్ము చెల్లి నిను చూచి

పేదలై, లోకాలు పెద్దలై యేలేటి

జొదులే, మతి చెడిరి తల్లి నీ యేడ్పు

రోదసిని నిండినది చెల్లీ

 

గోదావరీ యెడద కోసలను కోతపడి రా దగ్గరకు రమ్ము తల్లీ

జోదింక నిను కనడు చెల్లీ.. నా తల్లి

నాదు గర్భమున నిన్నాదుకుని ఉంటాను

నీదు నెగులును పోవచూడూ . కడలి

నీదు జోలికి నింక రాడూ

గోదావరీ దేవి కొస మనసులో వొరసి

ఏది నీ యొడలు నా తల్లీ చేర్చు

నాదు కౌగింటిలో చెల్లీ …. తల్లి నీ

లే దలిరు కెరటాలు చెల్లీ .. తల్లి నీ

లే దలిరు కెరటాలు నాదు కాల్వల నింతు

నీదు బొట్టును కడలి కనడూ నా తల్లి

నీదు సంగతి కడలి వినడూ

గోదావరీ మహా కూలంకషామృత

శ్రీదివ్య మధుతరంగాలూ.. చిన్న

సాదు కిన్నెర తరంగాలూ .. కలిసికొని

ప్రొదిగొను గంగా సరస్వతుల నీరములు

చాదుకొను తళుకు లురలించి .. చూడగా

సైదోడుతనము  మెరిపించె

 

 

విశ్వనాధ సత్యనారాయణ

కిన్నెరసాని పాటలనుండి….

 

మానసిక కాలుష్యం..

seaballycotton.jpg

 తుఫాను సమయంలో కారుమేఘాలు వడివడిగా పరుగిడే మాదిరిగా నాభి నుండి ఉద్భవించే మన ఆలోచనా తరంగాలు మనసు పొరలపై కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను వర్షిస్తూ సాగిపోతుంటాయి. ప్రతీ ఆలోచన మనసుపై తనదైన ముద్ర మిగుల్చుతూ పోతుంది. ప్రస్తుతపు ఆలోచన కన్నా బలీయమైన, మనసుకు ఇంపైన అలోచన ప్రస్తుతపు ఆలోచనని హరించి మనసులో తాత్కాలికంగా ఆవరించుకుంటుంది. మన ఆలోచనలు మంచివైనా, చెడ్డవైనా మన బుద్ధిని అనుసరించే అవి నిర్ధిష్ట రూపం సంతరించుకుంటాయి. ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఆలోచనాలను మాత్రమే మనసు కోరుకుంటుంటుంది. అయితే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అవమానాలు, భయాలు, అభద్రతాభావం, మనసుని అల్లకల్లోలం చేసే నెగిటివ్ ఆలోచనలను ఉసిగొలుపుతాయి. మనం ఎదుర్కొనే సంఘటనలకు ప్రతిస్పందనగా ఇబ్బడిముబ్బడిగా ఆలోచనలు ముప్పిరిగొంటుంటాయి

అయితే అవి కామక్రోధాదులనే మానవ బలహీనతలను మనస్సుపై వర్షించకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన ఇచ్చదే ! ఒక్కసారి ఇలాంటి బలహీనతలు మనస్సుపై ఆధిపత్యం సాధిస్తే… మన ఆలోచనలు కూడా ఈ బలహీనతలను ప్రేరేపించే విధంగానే ఉద్భవించడం ప్రారంభిస్తాయి. దీంతో మానసిక కాలుష్యం కమ్ముకుంటుంది. మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పటివరకూ ఆనందం అనిపించింది ఏదీ సంతృప్తిని ఇవ్వదు. నిశ్చలంగా మెలగవలసిన మనస్సనే దీపం అస్థిమితంగా కొట్టుకుంటుంది. ధనం, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే దురాశ, అన్నీ తెలుసునన్న అహంకారం, మనల్ని మనం సంస్కరించుకోవలసింది పోయి ఇతరుల విషయాలపై అమితాసక్తి, జన్మసంస్కారం లేకపోవడంవల్ల చేసే చర్యలు, కోరికలకు పగ్గాలు వేయలేకపోవడం వంటివన్నీ మన మనసుల్ని అస్థిమితపరుస్తూనే ఉంటాయి. మానసిక కాలుష్యం తొలగించుకోకుండా మనం మంచి మాటలు వల్లెవేసినా, మంచితనపు ముసుగుని కప్పుకున్నా నిష్ప్రయోజనమే స్థిమితమైన మనసుకి భావోద్వేగాలు అంటవు. అయితే అన్ని కాలుష్యాలూ తొలగించుకుని స్థిమితంగా ఉండాలన్న సంకల్పమే మనకు రుచించదు. మత్స్యకారుడికి నీచు వాసనే ఇంపైనట్లు కొందరికి మానసిక కాలుష్యమే సుగంధభరితం!! 

పుట్టినరోజు శుభాకాంక్షలు….

happy-birthday.jpg

 కొత్తపాళి (నారాయణస్వామిగారు) గారికి జన్మదిన శుభాకాంక్షలు…భగవంతుడు

మీకు ఆయురారోగ్యాలు, విజయాలు ప్రసాదించాలని , మీరు ఇంకా ఎన్నెనో

నృత్య ప్రదర్శనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ…ఒక బుల్లి కానుక…

కంప్యూటర్ ఎరా పత్రికలో మొదటిసారిగా ప్రారంభించిన బ్లాగు సమీక్ష లో మొదటి బ్లాగు సమీక్ష కొత్తపాళిగారిదే. అది రాసిందెవరో తెలుసా!! శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు.. మరి అది చదివితేగాని తెలీదు ఎలా ఉందో!!!!

వామ్మో!! ఏం దోపిడి!!!

నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఎలాగూ మనది ఉచిత కొనుగోలు కదా అని ధైర్యం చేసాం. వెయ్యి రూపాయలు చాలా సరుకులు తీసుకోవాలని కొన్ని తీసుకుంటే అవే 1500 అయ్యాయి. మొత్తం కలిపి పదిహేను ఐటమ్స్ లేవు. సరే అని కొన్ని తీసేసి బిల్లు వెయ్యికి దించేసి చిన్న క్యారీ బాగులో తెచ్చుకున్నాం ఆ సరుకులు. పట్టుమని పది వస్తువులు లేవు.

ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల  మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.

కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.  

దాల్చిన కప్ కేకులు – 5  –    65 – 00
హెర్బల్ సబ్బు         75 gm  – 55 – 00
నల్ల కారం పొడి        100gm   – 30 – 00
బాదాం                  100gm  – 84 – 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం     200gm  – 119 – 00
జీడిపప్పు                100gm  – 110 – 00 
అల్లం వెల్లుల్లి            200gm  – 44 – 00
పిస్తా                      100gm  – 89 – 00                  

టాగు మేఘం