నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for the ‘నా మనోభావాలు’ Category

శ్రీ శ్రీ శ్రీ మర్యాద “రమణ” గారికి,

                   images.jpg

రమణగారికి ముందుగా శతకోటి దన్యవాదములు. నాకు వ్యతిరేకంగానైనాసరే నువ్వు చేసిన ప్రచారం అభినందనీయం. దీనివల్ల నాకే లాభం కలిగింది. నా బ్లాగు విజిటర్శ్ రెట్టింపయ్యారు మూడు రోజులనుండి. నీ ప్రవర్తన , నీ బ్లాగు రచనతోనే  నీ వ్యక్తిత్వం అర్ఢమైంది  జీవితానుభవం లేదని. అందుకే నువ్వు అంటున్నా. నాయనా రమణ అసలు నీకు నా మీద ఎందుకింత కచ్చ. పని గట్టుకుని మరీ ఇలా దుష్ప్ర్రచారం చేస్తున్నావు.  ఇది చూసి నాకు కోపం రావట్లేదు. జాలి కలుగుతుంది.  చాలా రోజులుగా నా బ్లాగును క్రమం తప్పకుండా చదువుతూ ఇంత నిశితంగా విమర్శిస్తున్నావు.  వేరే పనేమీ లేదా?? ఐనా నా బ్లాగులో నేనేమి రాస్తానో నీకెందుకు. నాకిష్టమైనవాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాను . నువ్వు ఎవరు నాకు సలహా ఇవ్వడానికి. నా బ్లాగులో రచనలకు నేను బాధ్యురాలిని. నీకెందుకు ఆ బాధ. రచయితలతో నేను చూసుకుంటాగా ఏ గొడవలైనా.. ఐనా నీ పేరు ఊరు చెప్పడానికి ధైర్యం లేనివాడివి ఎందుకు ఆదరాబాదరాగా బ్లాగు మొదలెట్టి , అందరి బ్లాగులకెళ్ళి లింకులిచ్చి ,, కంగారు కంగారుగా నా మీద పోస్టులు రాయడమెందుకు. ఆ కంగారులో అన్నీ మళ్ళీ మళ్ళీ పోస్టు చేసానని కూడా చూసుకోలేదు.. ఇది చదివి అందరికి కోపమొచ్చింది కాని పెంట మీద రాయేస్తే మనమీదే పడుతుందని మిన్నకున్నారు. ఇప్పటిదాకా. కాని నీకు నా విషయంలో చాలా సందేహాలున్నాయని ఇలా రాస్తున్నాను. రోజు నా బ్లాగు చూస్తావని తెలుసు కాబట్టి.  నా బ్లాగు గురించిన విశ్లేషణకు కారణం తెలుసుకోవచ్చా.. దీనివల్ల నీకు లాభమేంటి.  ఇలా నాకు నీతులు చెప్పాలంటే ధైర్యంగా నా బ్లాగులో కామెంట్ చెయ్యాల్సింది. పిరికివాడిలా అనవసరంగా కొత్త బ్లాగు మొదలెట్టి రాయాల్సిన అవసరమేంటి?? ఒక్కటి తెలుసుకో. ఎదుటివారిని విమర్శించడానికి ముందు నీ గురించి తెలుసుకో. ఎదుటివారిని ఒక్క వేలెత్తి చూపితే మిగతా నాలుగు వేళ్ళు నిన్ను చూపుతాయి. ధైర్యంగా నీ సొంత పేరు, వివరాలతో రాయి. ఎవరూ వచ్చి నిన్ను తన్నరు విమర్శించినందుకు.

 

నీకు నా రచనల గురించి చాలా సందేహాలున్నట్లున్నాయి. ఐతే రేపు ఆదివారం సాయంత్రం హైదరాబాదులో బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సనత్‍నగర్ కృష్ణకాంత్ పార్కులో . నేను వస్తున్నాను. నువ్వు కూడా ఇలా బ్లాగు రాసినంత ధైర్యంగా సమావేశానికి  రావచ్చు.  అక్కడ మిగతా బ్లాగర్ల ముందు నీ సందేహాలన్నీ తీరుస్తా. అంతే కాని ఇలా బ్లాగ్లోకంలో నా గురించి దుష్ప్రచారం చేస్తే నాకు జరిగే నష్టమేమీ లేదు. అలా అని నేను ఊరుకునేదీ లేదు.

 

ఒక్కటి గుర్తుంచుకో రమణ (నీ పేరేదైనా సరే). నాకు ఇలా ఇంటర్నెట్లో రాయడంతో పాటు , ఇలాంటి చెత్త విమర్శలనుండి రక్షించుకోవడం తెలుసు. నువ్వు తప్పుడు పేరుతో అందరి బ్లాగులలో నీ బ్లాగు గురించి కామెంటు ఇచ్చినప్పుడే నీ I P అడ్రస్ తెలిసిపోయింది. దానితో నీ చిరునామా తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. నువ్వు సైబర్ కేఫ్, ఆఫీసు, ఇంటినుండి ఈ టపాలు రాసావో తెలిసిపోతుంది. అది నేను చేయగలను. ఒకె.

ఈ మధ్య బ్లాగులలో మహిళా బ్లాగర్లను లక్ష్యంగా విమర్శించడం ఎక్కువైంది. ఇది మంచిది కాదు. ఆడది ఆదరించి అమ్మలా అన్నం పెడుతుంది. ఆగ్రహిస్తే ఆదిశక్తి అవుతుంది . జాగ్రత్త..

 

చివరిగా ఈ అనామకులకు ఒక హెచ్చరిక

 

మీరు ధైర్యంగా మీ పేరుతో  వ్యాఖ్యలు రాయలేనివారు  మా బ్లాగులు చదవడమెందుకు, పిరికి వాళ్ళలా anonymous అని కామెంట్లు రాయడమెందుకు. అందులోనే మీ ధైర్యసాహసాలు తెలిసిపోతున్నాయి అందరికి. మెయిల్ ఐడి లేకున్నా మీకంటు ఓ పేరుంటుందిగా. రాయడానికి భయమెందుకు. మీ వ్యాఖ్యలకు మేము కోపంతో మిమ్మల్ని వచ్చి తన్నము. కాని శృతి మించితే మాత్రం ఇవి ఎలా నిరోధించాలో మాకందరికి తెలుసు….

 

 

ప్రకటనలు

వామ్మో!! ఏం దోపిడి!!!

నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఎలాగూ మనది ఉచిత కొనుగోలు కదా అని ధైర్యం చేసాం. వెయ్యి రూపాయలు చాలా సరుకులు తీసుకోవాలని కొన్ని తీసుకుంటే అవే 1500 అయ్యాయి. మొత్తం కలిపి పదిహేను ఐటమ్స్ లేవు. సరే అని కొన్ని తీసేసి బిల్లు వెయ్యికి దించేసి చిన్న క్యారీ బాగులో తెచ్చుకున్నాం ఆ సరుకులు. పట్టుమని పది వస్తువులు లేవు.

ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల  మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.

కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.  

దాల్చిన కప్ కేకులు – 5  –    65 – 00
హెర్బల్ సబ్బు         75 gm  – 55 – 00
నల్ల కారం పొడి        100gm   – 30 – 00
బాదాం                  100gm  – 84 – 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం     200gm  – 119 – 00
జీడిపప్పు                100gm  – 110 – 00 
అల్లం వెల్లుల్లి            200gm  – 44 – 00
పిస్తా                      100gm  – 89 – 00                  

పాపం పిల్లలు!!!!

       children.jpg 

వరూధినిగారి బ్లాగులో పిల్లలు సెలవుల గురించి చదివిన తర్వాత ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఈరోజుల్లో పిల్లలు కూలీలకంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఎప్పుడూ చదువు చదువు. అసలు ఈ చదువులు, పోటీ పరీక్షలు పిల్లలను మరమనుష్యులుగా చేస్తున్నాయి. ఒక ఆటలేదు, పాటలేదు.సెలవులు ఉన్నా అంతకంటే ఎక్కువ వర్క్ ఇస్తారు.ఇంతగా కష్టపడడం అవసరమా అంటే అవునూ అనలేమూ వద్దూ అనలేమూ. పిల్లలను మీకు వచ్చినంత చదువు అంటే క్లాసులో వెనకపడిపోతాడు , పెద్దపెద్ద చదువులు చదవాలంటే వీలు కాదు అని చదవమని వాళ్ళ వెనకాల పడటం తప్పటంలేదు. ఈరోజుల్లో పిల్లలతో పాటూ తల్లితండ్రులు కూడా కష్టపడక తప్పటంలేదు.
నేను చదువుకునేటప్పుడు ఐతే ఇన్ని కష్టాలు లేవు బాబు. హాయిగా చదువుకుంటూ, ఆటలపోటీలు, డ్యాన్సులు, పాటలపోటీలు అన్నీ చేసేవాళ్ళము. అప్పుడూ కూడా ఈ పుస్తకాల మోతకోలు ఉండేది. క్లాస్‌వర్క్, హోంవర్క్ నోట్సులు, అస్సైన్‌మెంట్లు, మంత్లీ టెస్టులు, ఉండేవి. ఐనా వారంలో రెండు రోజులు గేమ్‌స్.  అప్పుడప్పుడు పోటీలు. ఇప్పుడు పిల్లలకైతే అస్సలు గేమ్‌స్ పీరియడ్ అంటే తెలీటంలేదేమో. ఇంటర్ తర్వాత తీసుకునే IIT కోచింగ్ ఈ రోజు ఎనిమిదవ తరగతి నుండే ఇస్తున్నారు. అది అవసరమా పిల్లలకు. రోజులో సుమారు పన్నెండు గంటలు స్కూలులోనే. వేలకువేల ఫీజులు. వాళ్ళను తీసికెళ్ళి తీసుకురావడం మన డ్యూటీ.అప్పుడైతే 60% పైన మార్కులొస్తే ఆహా ఒహో అనేవారు. 70% దాటితే డిస్టింక్షన్.  ఇప్పుడు 95% దాటితేనే కాస్త మర్యాదగా ఉంటుంది. ప్చ్. ఏంటో.. మన పిల్లలకు చదివించి, కష్టపడ్డదాంట్లో సగమైనా మనం అప్పుడు పడి ఉంటే ఇంకా ఎన్ని డిగ్రీలూ ఉండేవో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నర్సరీనుండి ప్రారంభమైనా ఈ పరుగు ఉద్యోగం వచ్చినా ఆగదేమో…..మరి ఈ పిల్లలు తమ బాల్యాన్ని ఎలా అనుభవించేది. మేమైతే పరీక్షలైపోయి సెలవులు ఇస్తే నాలుగు రోజులు కాగానే బోర్ కొట్టేది. ఏం చేయాలో తోచేది కాదు. స్కూలు తెరిస్తే కాని కొత్త పుస్తకాలు ఉండవు చదువుకోవడానికి. ఏంటో ఈ చదువులు?? 

తద్దినం – అవసరమా???

 

అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.

 

తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??

 

నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ తద్దినం రోజు చనిపోయినవారి ఫోటో తుడిచి(అదీ ఏడాదికొక్కసారే) పూలదండ వేసి బొట్టు పెట్టి, నైవేద్యం పెట్టి, మిగతావాళ్ళూ  తినడం, తాగడం. ఇదేనా వారి ఆత్మశాంతి. చనిపోయినవారి పేరు చెప్పుకుని మనం సుష్టిగా తినడం, తాగడం. రోజు వండుకోకపోయినా ఆ రోజు మాత్రం మాంసాహారం(తినేవాళ్ళు) , పూరీలు, గారెలు, చేయాల్సిందే. లేకుంటే చుట్టాలు విసుక్కుంటారు. ఏం తిండి పెట్టారు అని. మందు కూడా తప్పనిసరి. అసలు అది ఒక పార్టీలా చేసుకుంటారు. .ఇక ఒకరికంటే ఎక్కువ కొడుకులుంటే సంవత్సరానికొక్కడు ఈ తద్దినం తనింట్లో పెడతానని వంతులు వేసుకుంటారు. ఇంట్లో కోడళ్ళు ఉంటే మీ అత్తమామకి మీరు చేసుకోండి మేమెందుకు చేయాలి పని అంటారు. మరి వాళ్ళ మొగుళ్ళు ఎక్కడినుండి ఊడిపడ్డారో (తాత, బామ్మలు లేకుండా).. ఇది ఒక బలవంతపు తంతులా చేసుకుంటారు.. ఆర్ధిక ఇబ్బంది ఉన్నా చేయక తప్పదు అన్ని రకాల వంటకాలు. ఇదంతా ఎవరి కోసం.ఎవరి పేరు చెప్పి ఎవరు తింటున్నారు. ఇది సమంజసమేనా??

 

ఐనా ఆ పెద్దలు కాని, ఏ దేవుడు కాని చెప్పాడా నాయనల్లారా! నేను పోయాక ఇలా చేయండి అని. అలా చేస్తే నేను సంతోషిస్తాను అని (బ్రతికున్నపుడు ఏం చూసుకున్నారో ఆ తల్లితండ్రులని ఈ పుత్ర రత్నాలు). చనిపోయాక చచ్చినరోజని తద్దినం పెడతారుగా మరి బ్రతికున్నపుడు ఆ మనిషి పుట్టినరోజు చేసారా. కనీసం వారికి పాదాభివందనం చేసి అభినందనలు చెప్పారా ఎవరైనా?? మరి మనిషి బ్రతికున్నాడన్న నిదర్శనానికి పుట్టినరోజు చేయనివాళ్ళు, ఆ మనిషి చనిపోయాక చచ్చినరోజు అని తద్దినం పెట్టి ఈ తినడాలు, తాగడాలు ఏంటో???

పెళ్ళైనవారికి మాత్రమే..

 

 

                 భార్య పుట్టినరోజు, తమ పెళ్ళిరోజు మొగుళ్ళకి గుర్తుండదు. ఎందుకు??

 

ఇది నా ఒక్కదాని సమస్యే , మావారికి మాత్రమే ఈ రోజులు గుర్తుండవు. నా రాత ఇంతే అనుకున్నా ఇన్ని ఏళ్ళు. కాని మొన్న వరూధినిగారి పుట్టినరోజునాడు తెలిసింది ఇలాంటి మొగుడు మహారాజులు కోకొల్లలు అని.

 

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని జరిపింది పెళ్ళి. అది ప్రతిసంవత్సరం జరుపుకోవడానికి అంత నిర్లక్ష్యం ఏమిటి. ఈ మొగుళ్ళకి. భార్య పుట్టినరోజు గుర్తుంచుకుని ఆ రోజు తనని ప్రత్యేకంగా అభినందించి, వీలైతే ఒ చిరు కానుక ఇస్తే మీ సొమ్మేం పోయిందంట. కలకాలం మీతో చివరిదాక కలిసి నడిచే ఇల్లాలిపై ఈ నిర్లక్ష్యం ఎందుకు? ఒక్కసారైనా ఆలోచించారా. తను మీ అభినందనల కోసం ఎంత ఎదురు చూసిందో, మీరు మర్చిపోయినా, గుర్తుండి చెప్పకపోయినా ఎంత బాధపడిందో. అందరికీ తెలిసిందే కదా ఆడాళ్లు సున్నిత మనస్కులు. అల్పసంతోషులు అని. పుట్టినరోజు, పెళ్ళిరోజు అని పెద్దగా పార్టీలు చేయాల్సిన అవసరం లేదే? ఇది మీ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఎప్పుడు ఇంటిపనులు,ఆఫీసుపనులతో బిజీగాఉండే వాళ్ళు ఈ ఒక్కరోజు గుర్తుంచుకోవడం,కాస్త సరదాగా గడపడం అసాధ్యమేమీ కాదనుకుంటా. మగాళ్ళకి ఆఫీసుపని ఒక్కటే. ఆడాళ్ళకి ఎన్నోపనులు ఉంటాయి. ఇంట్లో ఉన్నా. కాని వాళ్ళకు ఎలా గుర్తుంటాయి. మీరంటే ఇష్టం, అమితమైన ప్రేమ కాబట్టి.

 

ఐనా ఈ పుట్టినరోజు, పెళ్ళిరోజు అన్నీ విదేశీ సంస్కృతులు . మనమెందుకు జరుపుకోవాలి అంటారా. తప్పేముంది. నష్టమేమీ లేదే. దీనివల్ల భార్యాభర్తలు మరింత దగ్గరవుతారు. ప్రేమలు పెరుగుతాయి. పిల్లలు ఉన్నారు , ముసలాళ్లయ్యాక ఇవన్నీ చేసుకోవాలా అంటారా. భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైనా ఈ విషయంలో ఇతరుల జోక్యమెందుకు? భయమెందుకు. నా ఈ రోజుల్లో పిల్లలే మనకు చెప్తున్నారు. ఎంజాయ్ అని.

 

దసరా,దీపావళి అని పండుగలు చేసుకుంటారు. కొత్తబట్టలు కొనుక్కుంటారు. మరి ఇవి కూడా ఎందుకు అలా చేసుకోరు. డబ్బులకేమీ ఇబ్బంది కాదే. ఏ దేవుడు మనని అడగలేదు నా పేరు మీద పండుగ చేసుకోండి అని. మరి భార్య అడిగినా ఎందుకు మర్చిపోయామని అంటారు. తనకి అంత విలువ లేదా. అలాగని భార్య మీద ప్రేమ లేదని నేననను. కాని అప్పుడప్పుడు ఆ ప్రేమను కాస్త వ్యక్తపరుస్తుండాలని. పెళ్ళి కాకముందు, పెళ్ళైన మొదటి సంవత్సరం మాత్రం భార్య పుట్టినరోజు గుర్తుంటుంది. పెళ్ళిరోజు కొన్నేళ్ళ వరకు మర్చిపోకుండా జరుపుకుంటారు. తర్వాతేమవుతుంది. ఎందుకు దానికి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వరు మొగుళ్ళు. ఈ విషయంలో ఆడాళ్ళు మాత్రం ఎదురుచూస్తూనే ఉంటారు. మర్చిపోరు.

 

దీనివల్ల ఎవరూ మారరూ. అని తెలుసు. ఇవన్నీ మావారితో జరిగిన రభస. ఇంకా అలాంటివారు ఎంతమంది ఉన్నారో అని రాస్తున్నా.

 

ఇక నా సంగతి చెబుతా. ఈ విషయంలో పెద్ద గొడవే జరిగింది. మొదటి పుట్టినరోజు మావారు కొత్తచీర, కేకు కొన్నారు.సినిమా,గుడికి వెళ్ళడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత నేను అడిగితే ప్రతీ సంవత్సరం గుడికివెళ్లడం జరిగేది. నాకు తెలిసినవాళ్ళు తమ మొగుళ్ళు పెళ్ళిరోజుకు ఆ చీర కొన్నాం ఈ చీర కొన్నాం అని చూపెడితే బాధపడి మావారితో గొడవ పెట్టుకుంటే ఒక్కసారి మాత్రం పెళ్ళిరోజు మరునాడు చీర కొనిచ్చారు. అదీ విసుక్కుంటూ. అంతే మళ్ళీ ఇప్పటికీ చీర అడగలేదు. ఒకటి రెండుసార్లు మాటల మధ్యలో పెద్ద చర్చ జరిగింది మాకు. పండుగలు చేయమని ఎవరు చెప్పారు. తద్దినాలు పెట్టమని ఎవరు చెప్పారు. పుట్టినరోజు, పెళ్ళిరోజు చేసుకుంటే ఏమవుతుంది అని నా వాదన. నాకు గుర్తుండదు,ఐనా ఎందుకు చేసుకోవాలి అని ఆయన అంటారు. ఇక విసుగొచ్చి మా పిల్లలముందే మావారికి చెప్పా. నేను బ్రతికున్నపుడు నాకు పుట్టినరోజు ఉంటుంది కనీసం పూలు కొనివ్వాలని గుర్తుండదు. నేను పోయాక గుర్తుపెట్టుకుని మరీ నాకు తద్దినం పెట్టొద్దు అని ఖచ్చితంగా చెప్పా. మా అబ్బాయికి కూడా చెప్పాను. నేను పోయాక నా పేరు మీద తద్దినం పెట్టి పనికిమాలిన చుట్టాలని పిలిచి భోజనం పెట్టేకంటే అదే డబ్బు akshayapatra కి , లేదా ఎవరైనా చదువుకునే విధ్యార్థికి ఇవ్వమని. తద్దినం పెట్టకుంటే నేను ఫీలవ్వను అని మావాడికి చెప్పా. ఆరోజునుండి నేను పెళ్ళిరోజు, నా పుట్టినరోజునాడు ఏమీ స్పెషల్స్ చేయను. పిల్లలు అడిగినా కూడా . వాళ్ళను బయట తినేయమని డబ్బులిస్తాను.. ఒకోసారి తిక్కరేగితే కూరలు కూడా చేయను. పప్పు చారు మాత్రమే చేసి పెడతా. ఆయన పుట్టినరోజునాడు మాత్రం ఎదో చేస్తాను, నాకు తోచిన బహుమతి ఇస్తాను. ఆయనకు గుర్తుండకపోతేనేమి, నేను మర్చిపోనుగా. ఆయనని సాధిద్దామని కాదు. కాని బాధ అనేది ఉంటుంది కదా. పాపం ఏమనుకున్నారో ఏమో కాని గత సంవత్సరం నా పుట్టినరోజు నాడు బయటకు తీసికెళ్ళి నాకిష్టమైన పుస్తకాలు కొనిచ్చారు. పెళ్ళిరోజునాడు చికెన్ తెచ్చి బిరియాని చేయమన్నారు. పిల్లలు ఒకటే నవ్వడం అది చూసి. వాళ్లకు తెలుసుగా మా పోట్లాటలు.

 

 

 

ఇలా అనుకునే పరిస్థితికి మీ భార్యకు రానివ్వకండి. అలా అని గ్రాండ్‍గా పార్టీ చేసుకోమనటంలేదు. గుర్తుంచుకుని తనని ఆనందపరచండి చాలు. నాకు తెలుసు మొగుళ్ళందరికీ గుర్తుంటాయి ఈ రోజులు కాని బద్ధకం. నిర్లక్ష్యం. కాని అదే తన భార్యని బాధపెడుతుందని ఆలోచించరు.

 

 

 

 

 

 

ఎవరో తెల్లోల్లు పెట్టిన ప్రేమికుల రోజు, తల్లుల రోజు, తండ్రుల రోజు, బ్రతికిన రోజు ,చచ్చిన రోజు అని జరుపుకుంటాం. కాని మనమే మన తెలుగు బ్లాగర్ల రోజు ఎందుకు జరుపుకోకూడదు. అది కూడా ఎప్పుడు అని మనమే నిర్ణయించుకుందాం అని మన భూపతి మహారాజుగారు కొద్ది రోజుల క్రింద సెలవిచ్చారు. అమలు చేయక తప్పదు. మంచి అవిడియా కదా!

 

ఇప్పటిదాకా మనం సంతోషంగా బ్లాగులు రాసుకుంటూ పోతున్నాము. తెలుగును అభిమానించే వారందరికి చెప్తున్నాము. అలాగే ఈ తెలుగు బ్లాగర్ల రోజు చేసుకుందాము. ఎప్పుడంటారా? తెలుగు బ్లాగు గుంపులో 1000 మంది సభ్యులు చేరగానే. దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడు ఈ గుంపులో 865 మంది ఉన్నారు. బహుశా నవంబరులో అ సంఖ్యను చేరుకోగలము. కాని ఆ రోజు జరుపుకోవడానికి ముందు చేయవలసిన కార్యక్రమములు ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇది కొందరు బ్లాగరులు మాత్రమే చేసుకోవాల్సిన పండుగ కాదు. సుమారు  500 మంది తెలుగు బ్లాగర్లందరు గర్వంగా , సంతోషంగా జరుపుకోవల్సిన పండుగ. ఇది మన పండుగ. ఇందులో ఎవరు ప్రెసిడెంట్, సెక్రటరీ అంటూ లేరు. అందరు సభ్యులే. అందరు పాలుపంచుకోవాలి.

 

దీనికోసం ఏమేమి కార్యక్రమములు నిర్వహిస్తే బావుంటుందో ఆలోచించండి. గుంపులో చెప్పండి . చర్చించండి. దీని కోసం ఎక్కడికీ వెళ్ళక్కరలేదనుకుంటా. దేశదేశాలలో ఉన్న తెలుగు వారందరు (బ్లాగర్లు, వికీపీడియన్లు) తమ ఇంట్లోనే, తమ కంప్యూటర్ల ముందు కూర్చుని, కాస్తంత సమయం వెచ్చించి విజయవంతంగా జరుపుకోగలం.

 

నా ఆలోచన ఏంటంటేఉత్తమ బ్లాగుల అవార్డులువివిధ అంశాలలో

 

ఇప్పుడు మనమందరం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే….

 

పత్రికా రంగంలో అదీ ఈనాడు, కంప్యూటర్ ఎరా పత్రికలలో మన బ్లాగులు, వికీ గురించి సమగ్రమైన వ్యాసాలు వచ్చాయి. చాలా మంది తెలుగు అభిమానులకి దీని గురించి అవగాహన కలిగింది. ఇప్పుడు మనమే పూనుకుని ఇంకా ఎలా వ్యాప్తి చేయాలి అని ఆలోచించాలి. పత్రికా రంగం ఐపోయింది. టీవీ రంగం వైపు దృష్టి సారిస్తే. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ పడాలి. అప్పుడే అది సాగుతుంది. ఈటీవీ2 లో ప్రతి ఆదివారం తెలుగు వెలుగులు అనే కార్యక్రమములో మన బ్లాగులు , వికీ గురించి ఒక కార్యక్రమము వచ్చేలా చేయాలి. 

 

నాదొక ఆలోచన. వచ్చేనెల బ్లాగర్ల సమావేశానికి ప్రెస్ ని పిలిచి బ్లాగులు, యూనికోడ్, వికీ గురించి, మనం జరుపుకోదలిచిన బ్లాగర్ల రోజు గురించి ప్రకటించాలి. దీని వలన ఇంకా ఎక్కువమందికి తెలుస్తుంది. ఏమంటారు.? ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టండి మరి.

 

ఇది హైద్రాబాదులో ఉన్న బ్లాగర్లకి సంబంధించినది కార్యక్రమము కాదు. అందరూ అన్ని దేశాలలో ఉన్నతెలుగు బ్లాగర్లందరు ఈ తెలుగు బ్లాగులు, వికీ వ్యాప్తికి కృషి చేయాలి. చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ ఒక చోట చేర్చండి. అన్ని ప్రదేశాలలో అందరం ఒకేసారి జరుపుకుందాం.

 

ఆ బ్లాగర్ల రోజు వీలైతే అన్ని దేశాలలో ఉన్న తెలుగుబ్లాగర్లు ఒకేసారి ఫోన్లో కాని, gtalk లో గాని ఒకేసారి సమావేశమై ముచ్చటించుకుందాం. ఇది అసాధ్యమేమీ కాదనుకుంటా.

 

ఇంతవరకు తెలుగు బ్లాగు గుంపులో చేరని కొత్త బ్లాగర్లందరు  త్వరగా చేరండి. ఈ సమిష్టి కృషిలో పాల్గొనండి. విజయవంతం చేయండి. అందరికీ ఇదే ఆహ్వానం..

 

http://groups.google.com/group/telugublog

HAPPY BIRTHDAY JYOTHI

                            7.jpg

రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.

 

ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఊరికే టైప్ చెయ్యడం మాత్రం వచ్చేది. కాని నేనడిగిన సందేహలన్నింటికి  గుంపులో ఓపిగ్గా సమాధానమిచ్చేవారు ఎవరో ఒకరు.

 

గత సంవత్సరం అందరి ఆడాళ్ళలాగే  ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.నాలో నేనే అనుకోవడం. మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని బ్లాగు గుంపులో స్థిరపడిపోయా. సమయంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన వీవెన్, చావాకిరణ్, సుధాకర్, శిరీష్‌గారు, సిబిరావుగారు, రమణ, త్రివిక్రం, ప్రసాద్, రవి వైజాసత్య అందరికీ ఎంతోణపడి ఉన్నాను. బ్లాగుల మూలంగానే నాకే తెలియకుండా నాలో దాగి ఉన్న అభిరుచులన్నీ బయటపడ్డాయి. నాకు ఇష్టమైనవన్నీ బ్లాగుల రూపంలో భద్రపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎలాంటి అశాంతి అసహనం లేదు.నాకిష్టమైన వంటలు, సరదా కథలు,జోకులు,పాటలు అన్నీ తెలుగులో రాయగలుగుతున్నాను, నాలా ఆలోచించే, అర్ధం చేసుకోగలిగే మిత్రులతో పంచుకోగలుగుతున్నాను అని. బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా  ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..

 

ఇన్నేళ్ళుగా మావారు, పిల్లలకిష్టమైనవి చేయడమే నా బాధ్యత, కర్తవ్యం అంటూ బ్రతికేసాను. నాకంటూ ఇష్టాలు ఏమున్నాయి అని ఆలోచించలేదు. ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కూతురు అని మాత్రమే నాకు గుర్తింపు ఉండేది. నాకంటు ఒక గుర్తింపు ఉంటుంది, ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాని బ్లాగులలో రాసుకుంటూ పోతుంటే మీ అందరి ప్రోత్సాహం, అభినందనలు,గౌరవం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.నేను కూడా ఎదో చేయగలను, సాధించగలను అనుకుంటూ మరింత ఉత్సాహంతో సాగిపోయాను. ప్రయాణంలో ఎక్కడా అపశృతులు కలుగలేదు.ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ  కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని.  నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.  టీవీ అంటే చిరాగ్గా ఉందిప్పుడు. బయటికెళ్ళిగాని, ఫోన్లోగానీ సొల్లు కబుర్లు బంద్. తెలిసినవాళ్ళందరు అడుగుతుంటారు ఏంటిది అస్సలు కనపడటంలేదు, మాట్లాడటంలేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని.నవ్వి ఊరుకుంటాను. నేను చేసే పని చెప్పినా వేస్ట్ కాబట్టి. వాళ్ళకి అర్ధం కాదు.

 

ఏడాది ప్రయాణంలో నాకు ఎప్పుడు అలసటకాని, కష్టం కాని అనిపించలేదు. ఎందుకంటే నాకిష్టమైన తెలుగులో పని కదా.ఇష్టమైతే ఎదీ కష్టం కాదు. ఏడాది కాలంలో తెలిసి ఎవ్వరినీ నొప్పించలేదు. తెలియక నొప్పించితే క్షమించండి.మీకు తెలుసుగా నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను అని.

 

ఇవి నా ప్రయాణంలో అంచెలంచలుగా నా ఎదుగుదల.

 

మొదటి నెలలో రెండో బ్లాగు షడ్రుచులు

మూడు నెలలలో షడ్రుచులలో 100 టపాలు, మూడో  బ్లాగు గీతలహరి

ఆరునెలలో – 500 టపాలు , 4  బ్లాగులు

తొమ్మిది నెలలలో -1000 టపాలు , 5 బ్లాగులు

సంవత్సరానికి తెలుగు వెలుగులు వ్యాసం. 

 

ఇంకా ఏమన్నా ఉందా నేను చేయగలిగేది. లేదనుకుంటా. కాని ఇంకా ఎంతో సాధించాల్సింది ముందుంది అనిపిస్తుంది. ఆపై దేవుడి దయ.  నాకు ఒక్కటే లోటుగా ఉంది. తెవికీలో రాయడానికి సమయం చిక్కడంలేదు.

 

ఒక కొత్త శీర్షిక : నా స్నేహితురాలు స్వరూప చెప్పే ముచ్చట్లు అప్పుడప్పుడు రాస్తుంటాను. అది తెలంగాణ శకుంతల టైపు. పాతబస్తీలో ఉంటుంది.

 

సంవత్సరంగా నాకు నచ్చిన నా ఆలోచనలు, భావాలు, చర్చలు …. 

అదేంటో గాని.

వారెవ్వా క్యా సినిమా హై

అనుబంధం

ఆడపిల్ల

అదే మరి మండుద్ది

500

ఒక భార్య మనోవేదన

ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు

పెళ్ళిచూపుల ప్రహసనం

పడ్డానండి ప్రేమలో మరి

నమస్తే అన్నా

శతమానం  భవతి

మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు

 

ఏడాది క్రితం నేను ఏమి తెలీదు అంటూ గుంపులో కొచ్చా. కాని ఇప్పుడు అందరికంటే నేనే గొప్ప. నాకున్న బిరుదు, గౌరవం ఎవరికన్నా ఉందాఅదేంటాజ్యోతక్క.. అనే పేరు.  మరి అన్నా అని ఎవరన్నా పిలిపించుకున్నారా? విహారి ఏమంటావ్? నువ్వేనా మరి.

 

 

ఇప్పటికే కోతలు ఎక్కువయ్యాయి గాని….ఉంటా మరి..

టాగు మేఘం