నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for the ‘శ్రీధర్ సంపాదకీయాలు’ Category

బరువుగా చేస్తే భారమే మరి..

అనునిత్యం మనం అనేక పనుల్ని చేస్తుంటాం.. వాటిలో కొన్ని పనుల్ని చేసేటప్పుడు చాలా ఆనందాన్ని పొందుతుంటాం, కొన్నింటిని విధిలేక ఈసురోమంటూ ఎలాగో పూర్తి చేస్తాం. నచ్చని పనుల్ని చేసేటప్పుడు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో వత్తిడికి లోనవుతుంటాం…. ఆనందంగా చేసే పనులు మాత్రం అప్పుడే పూర్తయిందా అన్నంత హుషారుతో నిర్వర్తించడం జరుగుతుంది. ఒకే పని, ఇలా వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలను ఎందుకు మిగుల్చుతోంది అన్నది పనిని వారు స్వీకరించే మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే.. స్వతహాగా మీకు నచ్చకపోయినాచేసే పని పట్ల ఇష్టాన్ని పెంచుకుని చేస్తే అది భారంగా ఉండకపోగా అంతకు ముందెన్నడూ పనిలో రుచి చూడని సంతృప్తిని మిగుల్చుతుందన్నది నగ్న సత్యం.  అంటే ఇక్కడ మనం ఏవేవి ఇష్టాలు అనుకుంటున్నామో అవన్నీ మన మనసులో గిరిగీసుకు కూర్చున్న తాత్కాలికమైన పరిమితులు అన్న విషయం అర్ధమవుతుంది. పరిమితులు, పరిధుల్ని చెరిపివేస్తే ప్రతీదీ ఆనందం అందించేదే!!! 

 

ప్రతీ పనీ సులభమైనదే! ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరైనా చాలా ఉత్సాహంగా, తానొక్కడే సంస్థని నడిపిస్తున్నంత శక్తివంతంగా పనిచేస్తారు. కాలం గడిచేకొద్దీ వృత్తి పట్ల నిరాసక్త ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నిరాసక్తత ఏర్పడిందో అంతకుముందు క్షణాల్లో పూర్తయ్యే పనిని పూర్తి చెయ్యడానికి సైతం మానసికంగానూ, శారీరకంగానూ ఎంతో కష్టపడి చేయాల్సి వస్తుంటుంది. చాలామందిశ్రమించి శ్రమించీ తాము శారీరకంగా, మానసికంగా అలసిపోయామని భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇష్టమైన పనిని చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం , మనస్సు అలసిపోవు.అవలీలగా పనులు పూర్తవుతాయి. మారుతుందల్లా వృత్తి పట్ల, మనం చేసే పనుల పట్ల మనకు గల దృక్పధమే. ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనో, ఆర్ధికంగా ఎదుగుదల లేదనో. ఇతరత్రా కారణాల వల్లనో మనకు మనం మనల్ని పోషిస్తున్న వృత్తుల పట్ల నిరాసక్తతని పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంత చేస్తున్నా ఏమీ ప్రయోజనం చేకూరడం లేదన్న ప్రతిఫలాపేక్ష మనసుని కమ్ముకుంటుందో అప్పుడు చేసే ప్రతీ పనీ ఎదో రూపేణా ప్రయోజనం ఉన్నదే చేయాలన్న స్వార్ధం జడలు విప్పుతుంది. దీనితో పనిపట్ల అంకితభావం, ఆనందం కొరవడుతుంది. దీంతో పనే భారం అవుతుంది. పనే భారమైతే కొన్నాళ్ళకు మనకు మనమే భారమవుతాము. చేసే పనినే దైవంగా స్వీకరించి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడంలోనే ఆనందాన్ని పొందగలిగే మానసిక స్థాయిని పొందినప్పుడే మన పనులు మనకు భారం కావు. మన మనస్సు ఎప్పుడూ ఆనందంతో , సంతృప్తితో నిండి వుంటుంది..

మానసిక కాలుష్యం..

seaballycotton.jpg

 తుఫాను సమయంలో కారుమేఘాలు వడివడిగా పరుగిడే మాదిరిగా నాభి నుండి ఉద్భవించే మన ఆలోచనా తరంగాలు మనసు పొరలపై కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను వర్షిస్తూ సాగిపోతుంటాయి. ప్రతీ ఆలోచన మనసుపై తనదైన ముద్ర మిగుల్చుతూ పోతుంది. ప్రస్తుతపు ఆలోచన కన్నా బలీయమైన, మనసుకు ఇంపైన అలోచన ప్రస్తుతపు ఆలోచనని హరించి మనసులో తాత్కాలికంగా ఆవరించుకుంటుంది. మన ఆలోచనలు మంచివైనా, చెడ్డవైనా మన బుద్ధిని అనుసరించే అవి నిర్ధిష్ట రూపం సంతరించుకుంటాయి. ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఆలోచనాలను మాత్రమే మనసు కోరుకుంటుంటుంది. అయితే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అవమానాలు, భయాలు, అభద్రతాభావం, మనసుని అల్లకల్లోలం చేసే నెగిటివ్ ఆలోచనలను ఉసిగొలుపుతాయి. మనం ఎదుర్కొనే సంఘటనలకు ప్రతిస్పందనగా ఇబ్బడిముబ్బడిగా ఆలోచనలు ముప్పిరిగొంటుంటాయి

అయితే అవి కామక్రోధాదులనే మానవ బలహీనతలను మనస్సుపై వర్షించకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన ఇచ్చదే ! ఒక్కసారి ఇలాంటి బలహీనతలు మనస్సుపై ఆధిపత్యం సాధిస్తే… మన ఆలోచనలు కూడా ఈ బలహీనతలను ప్రేరేపించే విధంగానే ఉద్భవించడం ప్రారంభిస్తాయి. దీంతో మానసిక కాలుష్యం కమ్ముకుంటుంది. మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పటివరకూ ఆనందం అనిపించింది ఏదీ సంతృప్తిని ఇవ్వదు. నిశ్చలంగా మెలగవలసిన మనస్సనే దీపం అస్థిమితంగా కొట్టుకుంటుంది. ధనం, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే దురాశ, అన్నీ తెలుసునన్న అహంకారం, మనల్ని మనం సంస్కరించుకోవలసింది పోయి ఇతరుల విషయాలపై అమితాసక్తి, జన్మసంస్కారం లేకపోవడంవల్ల చేసే చర్యలు, కోరికలకు పగ్గాలు వేయలేకపోవడం వంటివన్నీ మన మనసుల్ని అస్థిమితపరుస్తూనే ఉంటాయి. మానసిక కాలుష్యం తొలగించుకోకుండా మనం మంచి మాటలు వల్లెవేసినా, మంచితనపు ముసుగుని కప్పుకున్నా నిష్ప్రయోజనమే స్థిమితమైన మనసుకి భావోద్వేగాలు అంటవు. అయితే అన్ని కాలుష్యాలూ తొలగించుకుని స్థిమితంగా ఉండాలన్న సంకల్పమే మనకు రుచించదు. మత్స్యకారుడికి నీచు వాసనే ఇంపైనట్లు కొందరికి మానసిక కాలుష్యమే సుగంధభరితం!! 

నవ్వుల కరువు

                              att124506.gif

దురదృష్టవశాత్తు గంభీరంగా ఉండడమే పెద్దరికం అన్న అపోహ సమాజంలో పాతుకుపోయింది. అందుకే చాలామంది వివిధ సందర్భాల్లో అవసరం లేకపోయినా కష్టపడి మరీ మేకపోతు గాంభీర్యాన్ని , కప్పుకుని తామెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫోజులు ఇస్తుంటారు. నిజమే…. గాంభీర్యం మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింపచేస్తుంది. అవసరం అయిన సంధర్భాల్లో అధికప్రసంగం లేకుండా గంభీరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం కూడా!  అయితే దానిని ప్రదర్సించవలసింది కొద్ది సందర్భాల్లో మాత్రమే . అంతే తప్ప, ఏవో కొంపలు మునిగిపోయినట్లు కన్పించిన ప్రతీ వ్యక్తి వద్దా…. చిరునవ్వు చిందిస్తే ఎక్కడ తాము చిన్నచూపు చూడబడతామోనని ఆముదం తాగిన మొహం పెడుతూ హావభావాల్లోనే పలకరింపులు జరపడం పెద్ద అవలక్షణం! నలుగురిలో కడుపుబ్బ నవ్వడానికి కూడా సందేహించేలా మన మనసుల్ని మనం  నియంత్రించుకుంటున్నాం. కడుపుబ్బ నవ్వడంనవ్వించడం కూడా ఓ అదృష్టమే. గాంభీర్యం చిరునవ్వుని హరిస్తోంది. మీరు మనసారా నవ్వుకుని ఎన్నాళ్ళైంది??

 

 

ఎలాంటి హిపోక్రసీలు లేకుండా, స్థాయిబేధాలు లేకుండా నవ్వొచ్చే సందర్భాల్లో చిరునవ్వులు చిందించగలగడం  ఓ అదృష్టం. మనమూ నవ్వుతాం.. ఎప్పుడంటే.. నవ్వితే ఎదైనా లాభం ఉంటుందనుకున్నప్పుడు బలవంతాన మొహంపై నవ్వు పులుముకుంటాం. ఎదుటి వ్యక్తి వైఫల్యాలను విన్నప్పుడూ పరోక్షంగా నవ్వుకుంటాం. ఇలాంటి కల్మషం ద్వారా లభించే పైశాచిక ఆనందమే మనకు హాస్యచతురతగా కన్పిస్తుంది. నేటి సినిమాల్లోనూ అంగవైకల్యాలను, అవలక్షణాలను హాస్యంగా చూపిస్తున్నారే తప్ప ఏ వర్గాన్ని బాధించని నిష్కల్మషమైన హస్యం కరువైపోయింది.  ఎలాంటి బేషజాలూ లేని స్వచ్చమైన నవ్వు మనసుని ఆహ్లాద పరుస్తుంది. అలాంటి నవ్వులను దూరం చేసుకుంటే మనం జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నట్లే.  డబ్బు, ఆస్తులు, కార్లు ఇచ్చే ఆనందం ఎన్నటికీ నాకింతే చాలుఅనే సంతృప్తిని  ఇవ్వదు. .. వాటిని సంపాదించే యావతో అవేవీ ఇవ్వని అనిర్వచనీయమైన ఆనందాలను, చిరునవ్వులను మన మొహాల నుండి శాశ్వతంగా దూరం చేసుకుంటున్నామంటే మనల్ని మనం బండరాళ్ళుగా మల్చుకుంటున్నట్టే.

…………………………………………………………………………………………………………………………………………

నల్లమోతు శ్రీధర్ తన పత్రిక కంప్యూటర్ ఎరా లో ప్రతి నెలా రాసే సంపాదకీయాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎదురయ్యే ఆలోచనలే . అందుకే అతని అనుమతి అడగకుండానే పాత పత్రికలనుండి రాస్తున్నాను.

టాగు మేఘం