నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఏంటండి మాస్టార్లు,

పెళ్ళిమాటలంటే అంత ఆటలా మీకు. ఈ తోటరాముడుగారు తమ కష్టాలు చెప్పుకునివాపోయారు. మిగతా పురుష పుంగవులేమో అయ్యో పీత కష్టాలు సీత కష్టాలు అని ఓదార్చుకుంటునారు. ఏంటి కాస్త అందంగా కనపడడానికి ఫోటో దిగడానికి కూడాకష్టమేనా. అమ్మాయిలు కూడా దిగుతారు మరి మీలా చెప్పుకోరే. మీ అబ్బాయిలు కష్టపడేది పావు వంతు మాత్రమే. అమ్మాయిలకు ఇరవై ఏళ్ళు వచ్చాయో లేదో మొదలు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ చదివిన మొగుడిని వెతకాలి. వాడితో పాటు వాడి కట్నం రేటు కూడా పెరుగుతుంది. ఇప్పుడే ఎదో గంతకు తగ్గ బొంత చూసి మూడుముళ్ళు పడ్డాయనిపిస్తే మీ గుండెలమీది కుంపటి దిగిపోతుంది కదా. ఐనా ఎంత చదివినా ఆడపిల్ల అంట్లు తోమక తప్పదు కదా. కొంత మంది తల్లితండ్రులు మాత్రమే దీనికి ఒప్పుకోరు. మంచి చీర నగలు ఉంటే సరి లేకపోతే అరువు తెచ్చి స్టూడియోలో అన్ని ఫోజులతో ఓ నాలుగు ఫోటోలు దిగి దానికో  పదేసి కాపీలు చెసి పెట్టుకోవాలి. ఇక పెళ్ళిళ్ళ పేరయ్య తాండవం మొదలు. అక్కడో సంబంధం ఇక్కడో సంబంధం ఉంది అంటూ డబ్బులు గుంజుతాడు. ఆడపెళ్ళి వారి నస భరించలేక పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాడు.

పెళ్ళి చూపులనగానే ఇంట్లో చచ్చేంత టెన్షన్. వాళ్ళుండే అరగంట కోసం ఇల్లంతా సర్ది, పరదాలు మార్చి, పక్కింట్లోనుండి మంచి పింగాణీ సామాను తెచ్చి బజారుకెళ్ళి మంచి స్వీటు ,మిక్స్చరు తెచ్చిపెట్టుకుని( అల్లాటపా స్వేట్లు, ఇంట్లో చేసినవి పనికిరావు చీపుగా ఉంటుంది మరి) మగపెళ్ళివారికోసం ఎదురుచూపులు. సరే వాళ్ళు వచ్చారు అమ్మాయి తల్లి తండ్రుల గుండెల్లొ దడ దడ మొదలు. పెళ్ళికొడుకు, అతడి ఫ్రెండు ( వెళ్ళాక అమ్మాయి గురించి మిగత ఫ్రెండ్సుదగ్గర కామెంట్ చెయ్యలి కద అందుకె తోకల వస్తాడు …ఇంకా తల్లిదండ్రులు,ఆడపడుచు,కొంతమంది దగ్గరి వాళ్ళు. కుశలప్రశ్నలయ్యాక అమ్మయిని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగ్గానే కూర్చొ పెడతారు. సైడుకి కూర్చుంటే సరిగ్గా కనపడదనా. గోడమీది సినిమా పోస్టరు చూసినట్టు క్రిందామీద, పక్కనా అన్నివైపులా చూసి తెలిసినా కూడా పేరు, చదువు లాంటి ప్రశ్నలు. ఇదంతా అమ్మాయి గొంతు ఎలా ఉందో తెలుస్కోడానికే. అబ్బాయేమో అమ్మాయి అందచందాలు గురించి ఆలోచిస్తుంటే అబ్బాయి తండ్రి కట్నం ఏమాత్రం ఇస్తారో, అందం ఏం చేసుకోను నాలుక గీసుకోనా అని అనుకుంటాడు. తల్లి ఎమో ఈ పిల్లకు ఇంటిపని వంటపని వచ్చో లేదో లేకుంటే నేను చావాలి.ఎదో ఈ భడవ పెళ్ళి చేసుకుని పెళ్ళాం వస్తే నేను ఇంటిపని వంటపని నుండి తప్పించుకోవచ్చు అని అనుకుంటుంది.ఆడపడుచేమో తన వంతు ఆడపడుచు లాంచనాలు ఎంతిస్తారో. కనీసం ఒక గొలుసు, చీర కొనుక్కుంటా అని ఆలోచనలు. స్వీట్లు,మిక్స్చరు ప్లేట్లలో పెట్టి అందరికి ఇచ్చారు. వద్దండి కతికితే అతకదు అంటూనే మొత్తం ఖాళీ చేసేస్తారు. తరువాత కాఫీలు .. ఇంకేం పనుంది కూర్చోడానికి. వస్తామండి ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాం. లేకపోతే పేరయ్యగారితో కబురంపిస్తాము నమస్కారం అని వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళ నుండి కబురొస్తుందని ఎదురుచూపులు. అమ్మాయేమో కలలలో విహారాలు. కాని వాళ్ళు రెండురోజుల్లో సుమారు ఓ ఆరు సంబంధాలు చూసారని వాళ్ళకి తెలీదు పాపం. పేరయ్యను కాని మధ్యవర్తిని అడిగితే ఐదు లక్షలు ఇస్తారా అంటారు లేకపోతే  జాతకాలు కలవలేదని టక్కున చెప్పేస్తారు.

మొదలు మళ్ళీ ఇంకో అబ్బాయిని వెతకడం.ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ కష్టాలు. అమ్మాయికా అబ్బాయికా.. అబ్బాయిల చదువు బట్టి కట్నం రేట్లు. తీసుకోకుంటేనే నామోషీ. ఇవ్వకుంటే వీళ్ళకు నామోషి. సో అబ్బాయిలు మీరే కష్టపడిపోతున్నారనుకోకండి.  కావాలంటేఆడపిల్లనుకాని, ఆడపిల్ల తల్లితండ్రులను అడిగి తెలుసుకోండి ఇది నిజమో కాదో?

Comments on: "పెళ్ళిచూపుల ప్రహసనం" (5)

  1. ఏంటబ్బా … తోటరాముడుగారి కష్టాల పోస్ట్ కి

    జ్యోతక్క రిప్లై ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా .. ఇదిగో ఇచ్చేసింది !!

    జ్యోతక్కా మజాకా !! 🙂

  2. హ హ..జ్యోతీ అదరగొట్టారు.నిజం చెప్పాలంటే భలె బెదరగొట్టారు.కానీ పాపం తోటరాముడు మగవాళ్ళ కష్టాలు చెప్పుకున్నాడు గానీ ఆడవాళ్ళకు కష్టాలు లేవు అనలేదు.ఆయన పోస్ట్ లో ఆడ అమ్రీష్ పురీ అన్న పదం తప్పించి మిగిలినది ఏమి తప్పుగా అనిపించలేదు నాకు.

  3. జ్యోతి గారూ
    అదరగొట్టేసారు కదండి. కాని ఒక్క మాట ఈ రోజులలో మీరు చెప్పిన టైపు పెళ్ళిచూపులు బాగా తగ్గిపోయాయి కదండీ, ఎక్కువగా internet పెళ్ళి చూపులే. ఒక రకంగా ఈ రోజులలో అబ్బాయిలకే పెళ్ళి అవటం కష్టంగా వుంది. అమ్మాయి చదువుకుని కొంచెం అందంగా వుంటే చాలు ఎగరేసుకుపోతున్నారు మన NRI అబ్బాయిలు. కనుక ఎక్కువ కష్టాలు అబ్బాయిలకే అని తోటరాముడు గారితో నేనూ ఏకీభవిస్తున్నాను.

  4. నిజమే తగ్గాయి. కాని సగం శాతం మాత్రమే. తోటరాముడుగారు పిల్ల దొరకలేదని అనటంలేదు. పెళ్ళి,పెళ్ళీచూపులు గురించి వాపోయారు.నేను అమ్మాయిలకు ఈ పెళ్ళిచూపుల తతంగం లాంటి కష్టాలు ఎక్కువ అన్నా. ఐనా పాతకాలంలో మంచిమొగుడు దొరకాలని అనుకునేవారు. కాని ఈ రోజుల్లో మంచి పెళ్ళాం అందమైనది,తమతో సమానంగా చదువుకుని సంపాదించే మంచిపెళ్ళాం కావాలని అబ్బాయిలే నోములు, వ్రతాలు చేయాలి.

  5. నిజం చెప్పారు. ఈ రోజుల్లో అందంగా ఉండే అమ్మాయిలు చాలా తగ్గిపోయారు. అందుకే అబ్బాయిలు కూడా నోములు చేయాలి :).

వ్యాఖ్యానించండి