నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ.

గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.

 

సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా  గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి గోదావరి.

 

చినుకులు, వానలు, కాలువలు, వాగులు, వరదలు, పచ్చపచ్చని పంటలు వీటన్నిటితో భాషలు గోదావరి తల్లికి తెలుసు. విరగబండిన వరిచేను కంకుల గాలి మొదలికల్లో గోదారి కనబడుతుంది. నిటారుగా  హుషారుగా పెరిగే చెరకు గడల్లోని గోదారి మాధుర్యం తినబడుతుంది. ఫ్యాక్టరీల్లోని పంచదారకు దారులు చూపుతుంది. ఎర్ర ఎర్రని మిరప పళ్ళల్లో గోదారి సూర్యోదయ అస్తమయ సౌందర్య విన్యాసాలను సూక్ష్మ స్వరూప విలాసాలుగా అందిగిస్తుంది.

 

శ్రామికులను, నాగరికులను సమభావంతో బ్రతుకుదారుల్లో సేదదీరుస్తుంది. నాశికాత్ర్యంబకంనుండి, కడలిలో కలిసేవరకు ఒక విస్తృతమైన నడక విలాసమైన నడక.  ఒక చోట చల్లగా ,, ఒక చోట వేడిగా, ఒకచోట లోతుగా, ఒక చోట ఇసుకమేటలపై తట్టులోతులు. ఇటువంటి మహానదిని గురించి సంస్కృత కవులు అనేక స్తుతులతో కవితలతో సుశ్లోకలయ్యారు.

 

తెలుగుకవుల స్పందనల విందారగిద్దాం మరి. నన్నయగారు ఆదిపర్వంలో దక్షిణ గంగ నావద్దయు నొప్పినఅని ప్రసక్తి మాత్రమే చేసినప్పటికి దక్షిణ గంగ అని ప్రశస్తి తెలిపారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. “త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండిసముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే  అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.

 

కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ

క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా

రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు

నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్

 

అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.

 

గోదావరి గోదావరి

గోదావరియంచు పల్కు గుణవంతులమేన్

గోదావరి తల్లి న

పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్

 

అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ  గోదావరి నామోచ్చారణతో  పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో సప్తగోదావరీ జలముతేనెఅని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనితఅని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి నేటివ్ స్పిరిట్తో సన్నాఫ్ ది సాయిల్గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.

 

తెలుగుల పుణ్యపేటిపోతన్న ఆంధ్రమహాభాగవతంలో రామాయణ కథా సంధర్భంలో దండకారుణ్యం గురించి తన శైలీ సౌందర్యంతో ఇలా వ్రాశాడు.

 

పుణ్యుడు రామచంద్రుడటబోయి ముదంబున గాంచె దండకా

రణ్యము తాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హి బర్హలా

వణ్యము గౌతమీ విదులావఃకణ పర్యటన ప్రభూత

ద్గుణ్యము ఉల్లసత్తురుని కుంజవరేణ్యము నగ్రగణ్యమున్

 

గోదావరి విమల జలకణాల పర్యటనలవల్ల దండకారణ్యం సద్గుణ గణ్యమైందనడం ఒక పవిత్ర కథా సందర్భ రస స్పందన!

 

15 వ శతాబ్దికే చెందిన ప్రగ్గడపల్లి పోతయ్య గోదావరిమకుటంతో ఒక శతకమే వ్రాసినట్ట్లు కవి చరిత్రకారుల వలన తెలుస్తున్నా ఆ శతక పద్యం ఒకటే ప్రసిద్ధికి వచ్చింది.. ప్రగ్గడపల్లి ” .. సురుచిరక్షోణీ పురంధ్రీ యశోధర ధమ్మిల్ల లతాంత మాలికో,  భతన్వీకుచశ్రీ, హరసువ్యాసమొనాగునీదగు ప్రవాహంబొప్పు గోదావరీ ! ” అనే తన పద్యంలో భూమికి గోదావరి ఒక దండగాను, ఆ భూమికి కునంపదకు విస్తృతమైన సొగసుగాను ఉగ్గడించాడు. “హంసనింశతిలో అయ్యలరాజు నారాయణామాత్యుడు నదులు జలపాతాలపై ఏకంగా ఇరవై నాలుగు పాదాల సీసమాలికను వ్రాశాడు. అందులో గౌతమిని పేర్కొన్నాడు. టేకుమళ్ళ రంగశాయి కవి  తన వాణీ విలాస వనమాలిక గ్రంధంలో గౌతముడు, గోవుల కథను ప్రస్తావిస్తూ నాశిహిత్ర్యంబకునుండీ అంతర్వేది వరకూ ఉండే గోదావరిని దేవతలు, మునులు ప్రస్తుతిస్తూంటారన్నాడు.

 

ఒకానొక కాలంలో తెలుగులో నోబెల్ బహుమానం వస్తుందని ఆశించబడిన గ్రంధం భక్త చింతామణి. ఒకానొక కాలం నాటి సాహిత్యవేదికలు భక్త చింతామణి పద్యాలతో పులకరించిపోయాయి.  ఆ గ్రంధకర్త, వేణీసంహార ఆ నాటక ఆంధ్రీకరణకర్త వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి మకుటంతోనే 1932 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో అంగీరస గౌతమీ పుష్కరం శీర్శికతో వ్రాసిన పద్యాల్లో చరిత్ర నిక్షిప్తం చేశారు.

 

భువన క్షేమ విధాయి పుష్కర జనంబుల్ వేనవేల్ గౌతమీ.

సవనంబాదిగ రాణ్మహేంద్రనగరిన్ సర్వాశలందుండి తీ

ర్తవిధుల్ సల్పి కొనంగ మూగెదరు : చోరవ్యాధి బాధాది వి

ప్లవ మాంగీరస నొందనీకు ప్రజ దేవా భక్త చింతామణీ

 

అనడంలో  యాత్రికులకు దొంగలబాధలు వంటివి లేకుండా చూడవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్ధించారు. పుష్కర దినాల్లో విమానాల్లో విహరించే జనం దేవతల్లా ఉన్నారని అందులోని వేరే పద్యాల్లో అంటారు. అంగీరస పుష్కరంలో బండ్లకు నిండ్లకు బాడుగ తగ్గెనని వ్రాశారు. అది విశేషమే. గోదావరి ప్రాంతాంలో నూతులలో నీళ్ళు, గోదావరి బాగా వచ్చేటప్పటికి పైకి వస్తుండడం వుంది. వసురాయకవి అందుకే దానిని ఎలా పోల్చాడో!

తల్లియొఱదాక నూతులు

కల్లోలవతీమ తల్లి గౌతమి రాకన్

గోదావరిలో లాంచీ ప్రయాణాన్నిగౌతమీ ధూమ నౌక విహారంఅని వ్రాసిన రోజులు చిత్రమైనవి!  వసురాయకవి గోదావరి సంబంధంకంగా జలమాహత్మ్యంపైన వేరుగానూ ఎన్నో వ్రాసారు. స్థానిక ముద్ర రచనలపై ఎక్కువగా ఉంటుంది.

 

 

 

 

Comments on: "తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి…1" (4)

  1. dont mind for writing this comment here… but I just wanted to know how u kept the CATEGORIES in your BLOGGER account… pls let me know… just comment the reply in some post of my blog… plss… plss.. plss..

  2. బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు

    మాలతి

  3. నా బోంట్లకు తెలియని గోదావరి నదీమ తల్లి గూర్చి వ్రాయబడిన సాహితీ సమాచారాన్ని అందించారు. అభినందనలు…నూతక్కి

  4. Mi kavithalu, Vyasaalu chaala bagunnayi … Keep doing the good work

వ్యాఖ్యానించండి