నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                          joint-family.jpg

నేటి రోజులలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. తల్లితండ్రులు కూడా బరువైపోయారు.

వాళ్ళను పంచుకుంటున్నారు లేకుంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. రెండు రోజుల క్రింద

వార్తలలో చదివా. పశ్చిమ బెంగాల్‍లో ఒక కుటుంబంలో మొత్తం 108 మంది ఒకే ఇంట్లో

కలిసి మెలసి ఉంటున్నారు. నిజమండీ అక్షరాలా108 మంది ఒకే దగ్గర ఉంటున్నారు.

అది సమంతా పరివారం. ఫర్నీచర్ వ్యాపారం. ఐదుగురు అన్నదమ్ముల పరివారం

చిన్నా పెద్దా కలిసి ఉంటున్నారు. రోజుకు 20 కిలోల చేపలు, 30కిలోల కూరగాయలు

 అవసరమవుతాయంట. ఉదయం ఐదు గంటలనుండి అర్దరాత్రివరకు పొయ్యి

వెలుగుతూనే ఉంటుంది. ఆడవాళ్ళందరు తలో పనిని పంచుకుని చేసుకుంటారు.

వాళ్ళ భోజనాల గది ఒక చిన్నపాటి రెస్టారెంట్‍లా ఉంటుంది. ప్రతీ నెలకొకసారి

కుటుంబ సమావేశం జరుగుతుంది. ప్రతి ఒక కుటుంబ సభ్యుడు పాల్గొనాలి.

అందులో ప్రతి సమస్య, ఖర్చులు, అన్నీ చర్చించబడతాయి.

ఇది సాధ్యమైనప్పుడు ఎందుకు చాలా మంది కలిసి ఉండటంలేదు. ఉమ్మడి

కుటుంబం వల్ల ఉపయోగాలే ఎక్కువ కదా? తమను కని పెంచిన తల్లితండ్రులు

బరువైపోతారా? వారి ఖర్చులు భరించడం కష్టమా?

Comments on: "కలసి ఉంటే కలదు సుఖం" (11)

  1. జ్యోతి గారూ… మంచి వార్త ఇచ్చారు. ఆత్మీయానుబంధాలు కరవైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాల అవసరం చాలా ఉంది. ఉమ్మడి కుటుంబం అనగానే చాలామంది అనేక సమస్యల్ని ఏకరువు పెడుతుంటారు. వాళ్లందరికీ తెలియాల్సిన విషయం ఇది. పాత పాట… ధరణికి గిరి భారమా… గిరికి తరువు భారమా… తల్లికి బిడ్డ భారమా అనే పాట గుర్తొస్తోంది.

  2. నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టినవాడినే. నా దృష్టిలో ఇటీవల మన దేశానికి జరిగిన మంచి ఏదైనా ఉంటే అది ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే. ఎందుకంటే-ఉమ్మడి కుటుంబాల్లో ఆప్యాయతా అనురాగాలు ఎండమావులు.సంసారం చెయ్యడం సంగతి అలా ఉంచి ఎవడి పెళ్ళాంతో వాడు మాట్లాడాలన్నా సంకోచమే.పిల్లలు తప్పు చేస్తే ధైర్యంగా మందలించలేని పరిస్థితి.ఎప్పుడు ఎవరు ఎందుకు అలుగుతారో తెలీదు.ఆడవాళ్ళకి పనుల దగ్గర వంతులు.మగవాళ్ళకి ఖర్చుల దగ్గర వంతులు.ఇవి కాక ఆస్తి రాజకీయాలు.దాని వల్ల ఏం జరుగుతుందంటే -ఉమ్మడి కుటుంబాలు నివసించే ఇళ్ళకి వెల్లవేయించే నాథుడు కూడా ఉండడు.అవి ఈసురోమంటూ కూలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతివాడికీ విపరీతమైన ego problem. ముఖ్యంగా వయసులో చిన్నవాళ్ళని ప్రతి విషయంలోను “నువ్వు చిన్న” అంటూ అందరి ముందూ తక్కువ చేసి అణచివేస్తూంటారు.ఇంటికంతా కలిపి ఒక ముసలాయనో ముసలావిడో అధ్యక్షత వహిస్తూ చిన్నవాళ్ళ నోళ్ళు మూయిస్తూ మానవ హక్కులనే వాటికి విలువ లేకుండా చేస్తూంటారు.ఆ వాతావరణంలో పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది కాని చదువులు చట్టుబండలవుతాయి. ఉమ్మడి కుటుంబాల్లో నేర్చుకునేదేమీ ఉండదు-పచ్చి స్వార్థం తప్ప.

  3. మా అమ్మవాళ్ళది (అంటే మామేనమామ గారిది) కూడా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబమే. 108 మంది కాదు కాని 20 మంది ఉండేవారు మొత్తం. కాని తర్వాత చాలా గొడవల మద్య వాళ్ళు విడిపోయారు.పది మంది ఒకచోట ఉన్నప్పుడు వాళ్ళ మద్య అభిప్రాయభేదాలు అనేవి సహజం కనుక ఎవరో ఒక్కరి లేదా కొంతమంది అభిప్రాయాలనే అమలుచేయడం జరుగుతుంది.మిగిలిన వాళ్ల ఇగో దెబ్బతినక తప్పదు. ఒకచోట ఉండి దెబ్బలాడుకోవడం కంటే విడిగా ఉంటూ అభిమానాలు మిగుల్చుకోవడమే ఉత్తమం. ఇదివరకటి రోజుల్లో కుటుంబం అంతా ఒకే వృత్తిని చేపట్టేవారు కాబట్టి అంతా ఒకచోట కలిసి ఉండడం సాద్యపడేది.ఆడవారు ఉద్యోగాలు చెయ్యడం ఉండేది కాదు. కాని ఇప్పటి పరిస్థితులు వేరు, ఈపోటీ ప్రపంచంలో అందరూ ఉన్నచోటనే ఉండాలంటే సాద్యపడదు.అయినా అందరు ఒక ఇంట్లో కలిసి ఉంటేనే ఆత్మీయాభిమానాలు ఉండాలని ఏముంది? అది ఒకొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి వారి వారి ప్రాదాన్యాతలను బట్టి ఉంటుంది.నా అనుభవం మాత్రం ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అన్నదమ్ములు,తోడికోడళ్ళ మద్యకంటే విడిగా ఉన్నవాళ్ళ మద్యనే అభిమానాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది.

  4. ఉమ్మడి కుటుంబాల గురించి నా అనుభవాలు కూడా మంచివి కావు. మా అమ్మా వాళ్ళు ఉమ్మడి కుటుంబమే. దాదాపు ఒక ఇరవై మంది దాకా ఉంటారు. ఎప్పుడూ కొట్టుకోవడమే ఏదో ఒక విషయమయ్యి.

    తాడేపల్లి గారు చెప్పిన వాటిలో చాలా మటుకు నిజాలే. నేను ప్రత్యక్షంగా చూసినవే.

    చేదు నిజాలు. 😦

  5. తాడేపల్లి గారి అభిప్రాయం చూసి ఆశ్చర్యపోయాను. ఏదేమైనా ఈ విశయంలో ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
    వుమ్మడి కుటుంభాల్లో అందరూ చచ్చివుంటే, “కీర్తి” ‘ప్రతిష్ట” “ఇంటి గౌవరం” బ్రతికి వుంటాYఇ.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఉమ్మడి కుటుంబాల గురించి అందరి అభిప్రాయమె నాదీను.కలిసి వుంటే కొట్టుకు చచ్చేవాళ్ళే అందరూనూ.ఎవరికి స్వాతంత్రం వుండదు.ప్రేమానురాగాలు పెరిగే పరిస్తితీ వుండదు.

  7. ఈ వురుకుల పరుగులటెన్షన్ ల జీవితం లో భార్య భర్త మధ్య సయోధ్య ఉండాలంటేనే ఇద్దరి లోనూ సహనం ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరు కొద్దిగా అవేశపరులైనా పరిస్తితి కష్టం. అటువంటిది ఎక్కువ మంది సభ్య్లులుంటే ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని ego feelings. వీళ్లంత ఒకే చోట ఉండి ఒకళ్ళనొకళ్ళు లోలోపల ద్వేషించుకుంటూ ఎవరూ ప్రశాంతం గా లేని కుటుంబం వల్ల ఎవరికి లాభం.

    అలా అని ముసలి తల్లిదండ్రులు విడి గా ఉండటం వల్ల బాధ పడితే అదీ మంచి పరిణామం కాదు.
    చిన్న వాళ్ళ వ్యక్తిత్వానికి పెద్దవాళ్ళు విలువనిచ్చి, పెద్దవాళ్ళ వయసుని, అనుభవాన్ని చిన్నవాళ్ళు గౌరవించిన పక్షం లో ఆ ఉమ్మడి కుటుంబం హాయిగా ఉంటుంది.

  8. మనుష్యులలో ఈ స్వార్ధం నిన్నటితరంలో లేదా వాళ్ళెలా కలిసి ఉన్నారు. కాని తల్లితండ్రులను కూడా చూడలేని స్వార్ధమా. అందుకే మనం మన పిల్లలు మనను చూడాలని అస్సలు అనుకోకూడదు. వాళ్ళకు చదువు ఉద్యోగం అయ్యేంతవరకు భాద్యత వహించి, మన శేష జీవితం గురించి మనమే తగిన వనరులు సమకూర్చుకోవాలి.

  9. జ్యోతి గారూ,
    అమ్మానాన్నలను చూసుకోకూడదని ఇక్కడ ఎవ్వరూ అనరు. ఉమ్మడి కుటుంబమంటే అమ్మానాన్నలే కాదు, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములూ అందరూ వాళ్ళ పిల్లాజెల్లలతో కలిసివుంటే అది వుమ్మడి కుటుంబం.
    పూర్వం ఎలా వున్నారు అంటే అలాగే వుడుక్కుంటూ, నసుక్కుంటూ, తమ తమ ఇష్టాలను చంపేసుకుంటూ, రాజీ పడుతూ బతికారు. ఇప్పుడూ అదే అవసరమా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  10. ఉమ్మడికుటుంబపు అనుభవం నాకు లేదుగానీ, మూడుతరాలూ ఒకే పంచన ఉన్న కుటుంబం నాది. “మన పిల్లలు మనను చూడాలని అస్సలు అనుకోకూడదు” అన్నారు జ్యోతిగారు. ఇది నిజం. ముదిమిలో తమను చూసుకోవడానికి పనికొస్తారని పిల్లలను కనే తల్లిదండ్రులు వ్యాపారం చేస్తున్నట్టే. ఆ ఉద్దేశంతో కన్నవారు పిల్లల ఆలనా పాలనా చూడటం, పెంచి పెద్దచేయడం ఇవన్నీ పెట్టుబడి కిందికి వస్తాయి. పెట్టుబడి పెట్టినవారందరికీ లాభం రావాలనేం లేదుగా! “దంపతులు కలసి జీవించడం ఒక యాక్సిడెంటు, పిల్లలు కలగడం ఒక ఇన్సిడెంటు. నిన్ను నవమాసాలు మోసి, కని, పెంచీ, నీకు అదిజేసి ఇదిజేసి…. ఇలాంటి మాటలన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కనమని వాడడగలేదు. కన్నాక వాడిని పెంచడం ఆ తలిదండ్రుల బాధ్యత. వాడు తమకోసం కొన్ని వదులుకొని తమను పోషించాలని ఆశించడం తప్పు. మీకోసం వాడు విదేశాలు చూసే అవకాశం వదులుకోవాలనడం, మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చాడు అని వాపోవడం ఇవికూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగే. ఒక చిరుద్యోగి ఉంటాడు. నెలకు 3000 జీతం. ఈ మహానగరంలో ఏమూసకొస్తుందా సంపాదన. అమ్మ,నాన్న, చెల్లి అందరూ వాడిమీద పడటం. వాడి బతుకు ఏంకావాలి. వాడిని నమ్ముకున్న పెళ్లాం సంగతేంటి, పిల్లలసంగతేంటి, వాడు చూసుకోవద్దా!?” ఇలా చాలా విషయాలు చెప్పారు శ్రీరమణగారు (ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు). మొన్నామధ్య ఆయనతో ఫోనులో మాట్లాడినపుడు ఇలాంటివే, సామాన్యప్రజానీకానికి విడ్డూరమనిపించే కొన్ని నిజాలు చెప్పుకొచ్చారు.

  11. నల్లమోతు శ్రీధర్ said:

    జ్యోతి గారూ.. ఆలోచనల్లో, నడవడికలో ఎవరికి వారికి మనమంతా ఒకటి అనే సమిస్టితత్వం ఉంటే ఉమ్మడి కుటుంబాల్లో లభించే సంత్ళప్తి ఎక్కడా లభించదు. మనం అందరం ఎవరికి వారు వేరుపడుతూ చివరకు ఇలా బాధలు, ఆనందాలు పంచుకునే తోడు లేక మన గోడు వెళ్లబోసుకోవడానికీ రోబోట్లను వాడుకునే దౌర్భాగ్య స్థితికి చేరువలో ఉన్నాం. మనుషులన్న తర్వాత పంతాలూ, పట్టింపులు, అభిప్రాయ బేధాలు లేకుండా ఎలా ఉంటాయి. ఏదీ ఆనందం ఇచ్చేది లేక (కెరీర్, బంధువులు.. ఇతరత్రా) పూర్తిగా మనిషి ఒంటరి అయిపోయినప్పుడు తెలుస్తుంది ఉమ్మడి కుటుంబాల విలువ. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే!

    -నల్లమోతు శ్రీధర్

వ్యాఖ్యానించండి