నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అన్నలకు, తమ్ములకు , అక్కలకు, చెల్లెండ్రకు అందరికి నమస్తె చెప్తున్న. అందరు మంచిగున్నరా. పొరగాండ్లకు పరీక్షలు ఐపోయినయి కదా. ఇంట్ల లొల్లి లొల్లి చేస్తున్నరా. ఇగో మీకో సంగతి చెప్దమని ఇలా వచ్చిన.మన ఐద్రాబాదుల ప్రతినెల తెలుగు బ్లాగులో bలాగులో రాసెటోల్ల మీటింగులు జరుగుతున్నయ్ కదా . అందులనేమో ఆడోళ్ళను పిల్వరు.పిల్వని పేరంటానికి ఎవరు పోతరు అని ఊర్కున్న. అంతా మొగోళ్ళే కల్సుకుని మాట్లాడుకుంటరు .కాని కిరణ్ అని ఓ పోరగాడు ఈ నెల మీటింగుకి రమ్మని అంటుండు. వెల్దామా వద్దా అని సోచాయిస్తున్న. ఐనా అక్కడికెల్లి ఆడోళ్ళేం మాట్లాడేదుంటది, వాళ్ళు వాళ్ళు ఎదో మాట్లాడుకుంటరు. ఐనా చూద్దాం ఇంకా టైముందిగా.

 

 

కాని ఈ బ్లాగులల్ల మస్తుగ రాస్తున్నరు అందరు..నేనైతే మొదాలు ఏందో అనుకున్నా.కాని ఇది పిచ్చిలాగ పట్టుకుంది ఏదో ఈ బ్లాగులు రాసేటోల్ల గురించి కొన్ని ముచ్చట్లు చెప్దామని ఇలా వచ్చిన. నేను మొదలెట్టినప్పుడైతే కొంచం మందే ఉన్నరు . కాని ఇప్పుడైతే మస్తు మంది రాస్తున్నరు. ఎన్నో దేశాలనుండి రాస్తరు. కాని రోజు చౌరస్తాలో వాళ్ళు రాసినవి చదుతుంటే ఇక్కడే ఉన్నరు అనిపిస్తది .ఏది చూడాల్నో ఏది చూడొద్దో ఎందో ఏమీ సమజ్ కాదు. కొంతమంది బ్లాగరుల గురించి నాకు తెలిసింది చెప్తున్న . ఎమన్న తప్పులుంటే మాఫ్ చేయాల.

 

ఈ కిరణ్ అనే పోరడు  ఎప్పుడు ఒక దాని మీద ఒకటి రాస్తూనే ఉన్నడు . చదవనీకి కూడా టైమ్ సరిపోదు. నన్ను బ్లాగు రాయమని ఒకటే పోరిండు. సుధాకరని ఉన్నడు ఎప్పుడు ఎదో ఓకటి ఎతుకుతూనే ఉంటడు .అతనికి ఈ మధ్య అందరికంటే చాలా బాగా రాస్తడని అవార్ఛ్ వచ్చింది. పెళ్ళి కాలేదు ఆ పైసలన్నీ ఏం చేసుకుంటడో. ఒక తమ్మి ఉన్నడు విహారి అని అమ్రీకాల ఉంటడు. మస్తు నవ్విస్తడు అందరిని. అతను రాసింది చదువుతే నవ్వి నవ్వి కడుపు నొస్తదనుకోండి . ఇగో ఇంకో తమ్మి ఉన్నడు ప్రసాదు అని .అతను కూడా బానే రాస్తడు కాని కొంచెం నిదానం. ఎక్కువ లొల్లి చేయడు . మన పెద్దాయన అదేనండి రావుగారు. ఆయన ఇంత వయసైనా పడుచోళ్ళకంటే ఉషారుగా అడవులల్లకు పోయి పిట్టల మీదా రాస్తుంటడు . ఈ మీటింగులు అయిపోయినంక మొత్తం ఫోటోలు పెట్టి మరీ జరిగింది ఓపిగ్గ రాస్తడు. వయసు పోరలు. ఆ పెద్దాయనను చూసి ఉషారు తెచ్చుకోండి .కామేశ్ సారున్నడు మస్తు పాటలు రాస్తడు. హిందీల,తెలుగూల పాత పాత పాటలు ఏరిమరీ రాస్తడు. అవి ఇంటుంటే దిల్ ఖుష్ ఐపోతది. రవి అని అమ్రీకల ఒక దోస్తున్నడు. అప్పుడప్పుడు  రాస్తుంటడు. ఆయన పనిల బిజి ఉంటడేమో.

ఇంకా చెప్పాలంటే కొరియాల ఉన్న సత్యసాయి సారు కూడా బాగా రాస్తరు. పద్యాలు, మాటలు భలే నవ్విస్తయి . ఇంకో సారు  ఉన్నడు కొత్త పాళి (అదేందో కొత్త పెన్ను) మస్తు రాస్తడు. పాటలు, పద్యాలు, మస్తు జోకులేస్తడు . మర్చిపోయిన నాగరాజు సారు బెంగులూరుల ఉంటడంట ..అప్పుడప్పుడు రాస్తడు. పనిల చాలా బిజి ఏమో . అమ్రీకలనే ఉన్న ఓ డాక్టరు ఇస్మాయిల్ ఇంతకు ముందు బానే రాసేటోడు. పాపం పరీక్షల పోయిండంట ..అప్పటినుండి అస్సలు కనపడత లేడు . మస్తు ఫికర్ ల ఉన్నడు. అతని పాప ముద్దుగ ఉంది కదా. ఇంక చెప్పాలంటే వీవెన్ ఎక్కువ మాట్లాడడు మజాక్ జేయడు .కాని పని మాత్రమ్ జబర్దస్తగా అనుకున్నది చేస్తడు. అమ్రీకలనే ఒక రాయలసీమ పోరడు ఉన్నడు రానారె అని . నేను రాము అని పిలుస్త. బుద్ధిమంతుడు.ఇంకా పెల్లి కాలే. కాని ముకంలో పెల్లికళ మెరిసిఫోతుంటది. అతడు కూడా మంచిగ రాస్తడు

ఈ మద్యల చాలా మంది ఆడోల్లు కూడా బ్లాగులు రాస్తున్నరు . రాధిక అని ఆమె కూడా అమ్రీకలనే ఉంటదంట. మస్తు కవితలు రాస్తది. స్వాతి అని కవితలు రాస్తది ఇక్కడే ఐద్రబాదులనే ఉంటది . సౌమ్య అని తమిళమ్మాయి కాని తెలుగు మనలానే మాట్లాడ్తది. చదుకుంటుంది.   బానే రాస్తది. రమ అని వంటలు రాస్తది. ఇంకో సంగతి చెప్పనా. సిరిసిరిమువ్వ అని ఒకామె రాస్తది. కాని తన అసలు  పేరు చెప్పదు. ఆమె భర్త కూడా బ్లాగులు రాస్తడంట . చాలా మంచిగ రాస్తుంది. చూడాలి ఎప్పుడు చెప్తుందో తనెవరో??

ఇంకో ఖతర్నాక్ పోరడు ఉన్నడు త్రివిక్రం ఒక పత్రిక నడిపిస్తడు . అందులో ఈ మధ్య బ్లాగరులను చీమతో కరిపించి పరేషాన్ చేసిండు. అది ఎవరు రాసారంటే అతను చెప్పడు, ఆ రాసినోళ్ళు చెప్పరు. ఐనా అందరు ఖుషీ అయిండ్రు. నాకు తెలిసింది ఇంత మందే. ఇంకా ఎవరున్నరబ్బా…. చదువరి గారు, కశ్యప్, శ్రీనివాసరాజు,.వీళ్ళందరు కూడా నెల నెలా మీటింగులకు తప్పకుండా వస్తరు . ఇంకా చాల మంది వస్తే బాగుంటది. ఎప్పుడో తెలుసా మరి….ఇప్పుడొచ్చే శనివారం అంట .ఐదో తారీఖు. ఎక్కడంటే మన ఉస్మానియా యునివర్సిటీ లైబ్రరి దగ్గర చమన్‍ల కలుసుకుని  ముచ్చట్లేసుకుని తిని వెళ్ళి లైబ్రరిల కెల్లి చదుకుంటరంట . ఎవడికి తెలుసు. ఈ మీటింగులల్ల అసలు పనికొచ్చేది మాట్లాడేది గంట. మజాకులు చేసుకుంటూ ఇంకో నాలుగు గంటలు . ఈ సారి ఓ సారు వస్తుండంట. జయదేవ్ తిరుమలరావుగారని ఓ పెద్దాయన వస్తుండంట. మల్లీ ఇంకోసారి అందరికీ చెప్తున్న రావాలె మరి . పతా రాసుకోండి. ఎల్లొచ్చాక ఏం జరిగిందో చెప్పాలి.

 

సమావేశపు స్థలము : ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంటు ఓరియంటల్ మానుస్క్రిప్టుల గ్రంథాలయం మరియు పరిశోధనాశాల .

పోలీస్ స్టేషన్ వెనక, ఉస్మానియా క్యాంపస్, హైద్రాబాదు – 7

 ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్……

నేనెక్కడున్నాను. ఏమయింది???ఓఓఓఓఓఓఓఓఓ  టీవీలో టి.ఆర్.ఎస్. నేత

చంద్రశేఖర‍రావుగారి ఉపన్యాసం విని పడుకున్నా అదే కల వచ్చింది. నిన్నటినుండి

సమావేశం గురించి మాట్లాడుకుంటూన్నాముక దా! ఇది అచ్చమైన హైదరాబాదీ

తెలంగాణా యాస. నాకలవాటే…

Comments on: "నమస్తే అన్నా!" (18)

  1. నేనుసైతం said:

    అదిరింది జ్యోతక్క……
    -నేనుసైతం

  2. నేనుసైతం said:

    మన రాయలసీమ పోరడు రానారె ని యాద్ మరిచినావా అక్కా…..
    -నేనుసైతం

  3. సుధాకరు said:

    ఇగో..నాకొక్క పైసా రానేదక్కా…ఒట్టు…ఆ తేనెపట్టోల్లు పడుకున్నారో ఏమో మరి..వచ్చిందని నవ్వాలా ఏడాలా అర్ధం కావట్నేదు…:-(

  4. నిజంగా మర్చినా తమ్మి. రాసేసా కదా.

    మరి అవార్డు వచ్చి పైసలన్ని దాచుకున్నవనుకున్న.ఎందుకూరుకున్నవ్ మరి. అడుగు గట్టిగా.లేకుంటే నీ బ్లాగుల ఆ బొమ్మ తీసేయ్

  5. అక్కోవ్…సక్కంగ సెప్పినవ్‌లే.

  6. అదిరింది జ్యోతి.

  7. అందరి గురించి బలే చెప్పారు జ్యోతి.

  8. మస్తుగా రాసిన్రు. జబర్దస్త్ నవ్విన.

  9. జ్యొతక్కో,

    నీ బ్లాగు జూసినంక మన పోరగాళ్ళు చానా మంది వున్నరని తెలుస్తది. నువ్వింకోటి యాద్ మరిచినవ్. గట్ల రాసిన బ్లాగుల లంకె గూడ పెట్టేస్తే గా లంకెల మింద గుర్రపు సవారి జేసుకుని మారాజులెక్కన పోతారు గాదే. గట్ల ఓ రౌండేసి మళ్ళీ నీ బ్లాగ్ కల్ల వచ్చి నువ్వు జెప్పింది నిజమో కాదో తెలుస్కుంటరు అక్కో.

    — విహారి

  10. మనవాళ్ళేకదా మళ్ళా పిలావాలా ఏమిటి?ఒకసారి వెళ్ళి రండి.తెలుగు ఆడబ్లాగర్ల తరుపున మీరున్నారని మాకూ కొండంత అండగా వుంటుంది.ప్రతిపక్షం లేకపోతే ఏకపక్షం గా నిర్ణయాలు వుంటాయి.

  11. పైన రాధికా కామెంటు చూస్తే మా వూళ్ళో ఒక ఆవిడ గుర్తొచ్చారు. ఆవిడ డాక్టరు. పాపం, చాలా బిజీబిజీ. ఐనా ప్రతీ సాహిత్య సమావేశానికి తప్పకుండా వచ్చేవారు. మేమెక్కడ మర్చిపోతామేమోనని వచ్చిన ప్రతిసారీ ప్రకటించేవారు – “నేనుకూడా రాకపోతే ఇది మరీ మగాళ్ళ క్లబ్బు అయి కూర్చుంటుందని వస్తున్నా!” అని. 🙂

    జ్యోతీ, చాలా బావుంది .. ఇలా చల్లటి పూట బంధుమిత్రులందర్నీ పేరుపేరునా గుర్తు చేసుకోవటం. ఇదొక నెలవారీ ఫీచరు చేస్తే పోతుందేమో .. కొత్తకొత్తగా రాస్తున్న బ్లాగర్లను కూడా పరిచయం చెయ్యొచ్చు.

  12. అక్కోయ్! మాచక్కగా చెప్పావు గానీ…నేనొచ్చేసినా…అయినా పరీక్షలన్నీ మంచిగనే పాసయ్యాగానీ, ఎం.డి. సీటు దొర్కలే…గది సంగతి. అయినా ఇంకో ఉజ్జోగం చూస్కొన్నాలే,ఇక ఫికర్ లే! మళ్లొస్తా…పాప ఏడుస్తోంది!

  13. అక్కా,

    నా కళ్ళు బైర్లుగమ్మినాయి, గాస్త మన్నించు.
    -నేనుసైతం

  14. డాక్టరు సాబ్,

    కొత్త ఉద్యోగం, సుహాస్ అల్లరి, శ్రేయ ముద్దు మురిపాలతో బిజీ బిజీ గా వున్నారనుకుంటా.

    -నేనుసైతం

  15. అందరికీ మళ్ళీ నమస్తే చెప్తున్న. ఊరికే రమ్మంటున్నరు కదా అని మీటింగుకి వెళ్ళా. మస్తుగ ఎంజాయ్ చేసిన.ఇంకా విశేషాలు మన రావుగారు చెప్తరు. కాని నేను ఒక్కటే చెప్తున్న. ఈ మీటింగులకి రానోల్లు చాలా పోగొట్టుకుంటున్నరు. వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత బాగుంటదో??

    రాధిక నువ్వు ఎప్పుడు బ్లాగులల్లనే తిరుగుతుంటవా.. అలా గుంపులోకి రారాదు. అక్కడ అందరూ ఉంటరు మస్తుగ ఉంటది. ఏమంటవు మరి.

  16. బాగ రాసిండ్రు. రావాల్నని నాగ్గూడ ఉంటది గానీ చానా పైసల్ గావాల్నాయె. గట్ల పోగొట్టుకుంటాండ్రు అని సదువంగనె దుక్కం రాబట్టె!

  17. bangalore lo ekkada avutundi blogrla samaavesam
    cheppandi

వ్యాఖ్యానించండి