నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పొద్దులో స్వాతి రాసిన కవిత చదవగానే నా చిన్ననాటి వేసవి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ శోధన సుధాకర్ రాసిన టపా చదవగానే ఆ మధుర జ్ఞాపకాలు ఇక నా మనసులో దాగుండలేక బయటకొచ్చేసాయ్.నిజంగా అవి చాలా మధురమైనవి మరపురానివి. చదువుతోపాటు, ఆటలు, సినిమాలు,ఊర్లు తిరగడం,వివిధ కాంపిటీషన్లలో పాల్గొనడం ..ఓహ్! అవి మన మనసులోని ఒక అరలో దాగున్నాయి. ఎప్పటికి మరవలేము.

స్కూలు ఫైనల్ పరీక్షలంటే ఇప్పటిలా ఎక్కువ టెన్షన్ ఉండేది కాదు. ప్రతినెలా ఎస్సైన్మెంట్స్,మంత్లీ టెస్టులు రాయడం అలవాటై అంత కష్టంగా ఉండేది కాదు చివరికొచ్చేసరికి. ఒక్కో పరీక్షా ఐపోతుంటే ఆ సబ్జెక్ట్ పుస్తకాలు మళ్ళీ చూడాల్సిన పనిలేదుకదా అనే ఆనందం కలిగేదీ ప్రతిరోజూ పరీక్షలప్పుడు. హమ్మయ్య పరీక్షలైపోయాయి. తర్వాత ఏం చేయాలి. అది చేయాలి ఇది చేయాలి. రెండు నెలలు స్వేచ్చ దొరికింది అని అందరి ముఖాలు వెలిగిపోయేవి.చాలా మంది తమ స్వంత ఊర్లకు వెళుతున్నాము అని చెప్తుంటే నాకు బాధేసేది. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదులోనే. చుట్టాలందరూ ఇక్కడే. మా పెద్దాళ్ళని తిట్టుకునేవాళ్ళం ఎవ్వరూ ఊర్లో లేరు వెళదామంటే అని.

తెల్లారింది. స్కూలు ఉన్నప్పుడు పొద్దున్నే లెగాలంటే చచ్చే విసుగొచ్చేది ,,ఇంకా నిద్రొచ్చేది. కాని సెలవులు మొదలు కాగానే రోజు కంటే ముందే మెలకువ వచ్చేది …ఎండాకాలం కదా.మళ్ళీ పడుకుందామన్న నిద్రొచ్చేది కాదు. సరే లేచి బ్రష్ చేసుకుని పాలు తాగి పేపర్ చూసేవాళ్ళం నేను మా తమ్ముళ్ళు. ఆ తర్వాత సెలవుల్లో ఏం చేయాలి అని ప్రోగ్రాం తయారు చేసుకునే వాళ్ళం. ముందుగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం. అమ్మకు వీలు దొరికేది అప్పుడే.నాన్న దగ్గర మెల్లిగా అనుమతి తీసుకుని, సాయంత్రం పయనం.అమ్మమ్మ ఇల్లు కూడా సిటీలోనే.
ఐనా సంతోషం. అమ్మమ్మ, మావయ్యలు మాకు కావల్సినవి తెచ్చేవారు. అక్కడ మాకు వింతగా ఉండేది. పెంకుటిల్లు.మట్టితో అలికిన వంటిల్లు. మావయ్య రంపపు పొట్టుతో పొయ్యి తయారు చేస్తుంటే వింతగా చూసేవాళ్ళం. అమ్మమ్మ ప్రతిశుక్రవారం వంటిల్లు పేడతో అలికి ముగ్గులు పెట్టేది. మేము శ్రద్దతో చూసేవాళ్ళం. అక్కడ ప్రొద్దున్నే ఇంటిముందుకే ఇడ్లీలు అమ్మేవాడొచ్చేవాడు. ఇంటి ముందు అరుగుమీదే కూర్చుని తినేవాళ్ళం. ఎదన్నా సినిమాకి వెళ్ళడం.అలా కనీసం మూడురోజులైనా ఉండేవాళ్ళం. ఎక్కువ రోజులుంటే నాన్నకి భోజనానికి కష్టం కదా!

తర్వాత మా నాన్నమ్మని రమ్మని పిలవడం. ఆవిడ మా పెదనాన్న దగ్గరుండేది. ఆవిడ వస్తుందంటే మాకు పండగే. రోజు కథలు చెప్పించుకోవడం.దగ్గరలోని థియేటర్లో సినిమాలకెళ్ళడం. ఆవిడకి సినిమా పిచ్చి ఉండేది. రాగానే నాన్నమ్మ సినిమాకెల్దామా అని పేపర్ తిరగేసి ఏం సినిమా నడుస్తుందో చూసి మరుసటిరోజే ప్రోగ్రాం ఫిక్స్ చేసేవాళ్ళం.  అత్తగారిని ఒక్కదానిని పంపడం బాగుండదు కనుక అమ్మ నన్నే తోడు పంపేది. అప్పట్లో పాత సినిమా మార్నింగ్ షో టికెట్ ధర యాభై పైసలు..బాల్కనీ ఐతే ముప్పావలా. కొత్త సినిమా ఐతే రూపాయిన్నర, బాల్కనీ ఐతే రెండు రూపాయలు.మార్నింగ్ షో లో మంచి జానపద, ధార్మిక చిత్రాలు చాలా వచ్చేవి. పదకొండు గంటల సినిమాకు తొమ్మిది గంటలకే వెళ్ళీ చెప్పులు లైనులో పెట్టి ఒక్కరు కాపలా ఉండి టికెట్లు ఇచ్చే పది నిమిషాలు ముంది అందరు వెళ్ళి లైన్లో నిలబడటం. అక్కడ లైన్లో చెప్పులు లైన్లో పెట్టి ఆడాళ్ళు మరో పక్కన నీడలో కూర్చుని ముచ్చట్లాడుతూ ఉంటారు. ఒకరికొకరికి పరిచయం ఉండదు కాని దగ్గరి బంధువులు అన్నట్టుగా మాట్లాడుతుంటారు.
అప్పట్లో టీవీ లేదు. రేడియోనే దిక్కు. నేనైతే శనివారం,ఆదివారం మద్యాహ్నం కొఱకు వేచి చూసేదాన్ని.  బాలానందం, బాలవినోదం కార్యక్రమాల కోసం. ఆదివారం మూడుగంటలకి రేడియోలో సంక్షిప్త చిత్రం వచ్చేది. సెలవుల కొత్తలో బానే ఉండేది. పోనూ పోనూ విసుగొచ్చేది.ఎండలో ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. సీతాఫలం సీజన్‌లో దాచి పెట్టుకున్న గింజలు, కొత్త చింతపండులో నుండి చింతగింజలు తీసి డబ్బాలో పోసి పెట్టుకునేదాన్ని.ఎన్ని ఆటలో ఆ రోజుల్లో. నాకు స్నేహిరాళ్ళెవరు లేరు మా ఇంటిదగ్గర.తమ్ముళ్ళతోనే ఆడుకోవడం.

సీతాఫల గింజలను రాసిగా పోసి గట్టిగా వూదాలి. చెల్లాచెదురైన గింజలని పక్కదానికి తాకకుండా తీసుకోవాలి. ఎవరెక్కువ పోగు చేస్తే వాళ్ళే గెలిచినట్టు.

ఇవే గింజలతో వనగండ్లు(గుజ్జనగుళ్ళూ) ఆడుకోవడం. అందులో ఎన్నో రకాలు. అప్పుడప్పుడు అమ్మ కూడా ఆడేది.

నేలపై చాక్‌పీసుతో గళ్ళూ గీసి  అష్టాచెమ్మా ఆడడం. చింతగింజలే పావులుగా.

ఎక్కడో దాచిపెట్టిన కైలాసం(పరమపద సోపానం) తీసి ఆడుకోవడం. మా నాన్నమ్మ ఐతే ఇందులో మోసం(తొండి) చేయొద్దు పాములు తినేస్తాయి అని భయపేట్టేది. మేము నిజమే అని నిజాయితీగా ఆడేవాళ్ళం.

కాళ్ళు జాపుకుని కాళ్ళా గజ్జే కంకాళ్ళమ్మా అని ఆడుకోవడం అప్పుడప్పుడు.

అరచేతిని నేలపై పరిచి వేళ్ళు దూరంగా పెట్టి a b c d అని d  అన్న వేలుని లోపలికి మడిచేయడం.అలా ఎవరి వేళ్ళు అన్నీ ముడుకుంటాయో వాళ్ళే గెలిచినట్టు. చివరగా మిగిలినవారు ఓడిపోయినట్టు.

పేపర్ పెన్సిల్ తీసుకొని గల్లూ గీసుకొని చుక్కలాట ఆడుకోవడం,లేదా Name, Place, Animal ,Thing ఆడడం.

ఐదు రాళ్ళను ఒకే సైజులో కొట్టుకుని గచ్చకాయలు ఆడుకోవడం.  

అప్పుడప్పుడు చదరంగం, మా పెద్ద తమ్ముడైతే ఆడినంతసేపు బానే ఆడేవాడు. తను ఓడిపోతున్నట్టు అనిపించగానే బోర్డ్ ఎత్తేసేవాడు. మళ్ళీ అక్కడ కొట్లాట.

ఎండాకాలం మద్యహ్నం సరిగ్గా ఒంటిగంటకు పుల్ల ఐస్‌క్రీం వాడొచ్చేవాడు. వాడి గొంతు రెందు వీధుల అవతల ఉన్నా వినపడేది. రంగు పుల్ల ఐతే ఐదు పైసలు .పాలది ఐతే పదిపైసలు. అమ్మ రోజు ఇప్పిచ్చేది కాదు. పాత స్కూలు పుస్తకాలు తీసి బండి మీద వచ్చే పీచు మిఠాయివాడికి ఇచ్చి దాని బదులు పీచు మిఠాయి తీసుకుని కొంచం కొంచం తినేవాళ్ళం.

ఎండలు తగ్గగానే బయటపడడం. మా తమ్ముళ్ళూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో నేనూ కూడా కర్రా బిళ్ళంగోడు ఆడేదాన్ని.

ఎండాకాలం వచ్చిందంటే కనీసం రెండు సార్లు అమ్మతో మల్లెపూలజడ వేయించుకోవాల్సిందే. ఇప్పట్లా విస్తరాకు మీద కుట్టి జడకు అతికించడం కాదు. జడకే కుట్టేది అమ్మ. మూడూ గంటలు నా తలను అప్పజెప్పి కూర్చునేదాన్ని. తర్వాత పట్టు లంగా, సొమ్ములు వేసుకుని స్టూడియో కెళ్ళి ఫోటో దిగడం. ముప్పై ఏళ్ళ క్రింది ఫోటో కూడా ఉంది నా దగ్గర.
పరీక్షా ఫలితాలు రాగానే అమ్మ చేసేపని లెక్కల పుస్తకం కొనడం. మే నెల మా ట్యూషన్ సార్ రాడు. కాని లెక్కలు చేయమనేవాడు. కొత్త క్లాసులోని పుస్తకం కొని రోజు చేయడం.లైబ్రరీకెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం అవి గంటలోనే చదివేయడం. అదే రోజు మార్చుకునే వీలులేదు. వేరే పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీకెళ్ళి కామిక్స్,జానపద కథల పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. పుస్తకాలకంటే అమ్మ డబ్బులిచ్చేది ఎమీ అనేది కాదు.భయం అంటే గుర్తొచ్చింది.మాకాలనీలో వీధి దీపాలుండేవి కావు. ఏదన్నా పుస్తకం తెచ్చుకోవాలంటే సందు చివర ఉన్న దుకానం కెళ్ళాలంటే ఇళ్ళలోని దీపాల కాంతులలో వెల్లి కొనుక్కునేదాన్ని. ఐతే తిరిగొచ్చేటప్పుడు మాత్రం చచ్చేంత భయం. వెనకాల ఎవరన్నా వస్తున్నారేమో,చెట్లమీద దయ్యాలున్నాయేమో అని. అంటే పుస్తకం గట్టిగా పట్టుకుని వేరే ఆలోచన లేకుండా ఒకటే పరుగు. ఇంటిముందుకొచ్చాక గాని గుండె డడ తగ్గేది కాదు.

రాత్రి ఐంది ఏం చేయడం. క్యారం బోర్డ్ ఆడడం లేదా బాల్కనీ సీలింగుకు తాడు కట్టి ఊయలలూగడం. స్కూళ్ళూ తెరిచే రోజులు దగ్గరపడుతున్నాయి. పుస్తకాలు తెచ్చుకుని వాటికి అట్టలు వేసుకోవడం,లేబుల్స్ అతికించి పేర్లు రాసుకోవడం. కొత్త పెన్సిళ్ళు,రబ్బర్లు,కంపాస్ బాక్స్,షూస్,సాక్స్,రిబ్బన్లు,బ్యాగులు మన శరీరం తప్ప అన్నీ కొత్తవే.ఇంకా రెయిన్‌కోట్ కూడా రెడీగా ఉండేది.

స్కూల్లూ తెరిచే రోజు కోసం ఎదురుచూడడం.అన్నీ కొత్తవి వేసుకుని స్నేహితులకు చూపెట్టాలనే కుతూహలం.సెలవుల్లో ఎవరేం చేసారొ తెలుసుకోవాలనే ఆత్రుత.
 
 

Comments on: "గుర్తుకొస్తున్నాయి…గుర్తుకొస్తున్నాయి….." (2)

  1. కథనం racy గా ఉంది. జ్యోతి – స్వీయ చరిత్ర కూడా రాయి జ్యొతక్కా. తెలంగాణా నేపథ్యంలో స్వీయ చరిత్రలు స్వల్పంగా ఉన్నాయి.

  2. మీ నుండి ఇలాంటి టపాను అస్సలు ఊహించలేదు.ఆద్యంతం ఆశక్తికరం గా చెప్పారు విషయాలను.

వ్యాఖ్యానించండి