నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 

 

                 భార్య పుట్టినరోజు, తమ పెళ్ళిరోజు మొగుళ్ళకి గుర్తుండదు. ఎందుకు??

 

ఇది నా ఒక్కదాని సమస్యే , మావారికి మాత్రమే ఈ రోజులు గుర్తుండవు. నా రాత ఇంతే అనుకున్నా ఇన్ని ఏళ్ళు. కాని మొన్న వరూధినిగారి పుట్టినరోజునాడు తెలిసింది ఇలాంటి మొగుడు మహారాజులు కోకొల్లలు అని.

 

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని జరిపింది పెళ్ళి. అది ప్రతిసంవత్సరం జరుపుకోవడానికి అంత నిర్లక్ష్యం ఏమిటి. ఈ మొగుళ్ళకి. భార్య పుట్టినరోజు గుర్తుంచుకుని ఆ రోజు తనని ప్రత్యేకంగా అభినందించి, వీలైతే ఒ చిరు కానుక ఇస్తే మీ సొమ్మేం పోయిందంట. కలకాలం మీతో చివరిదాక కలిసి నడిచే ఇల్లాలిపై ఈ నిర్లక్ష్యం ఎందుకు? ఒక్కసారైనా ఆలోచించారా. తను మీ అభినందనల కోసం ఎంత ఎదురు చూసిందో, మీరు మర్చిపోయినా, గుర్తుండి చెప్పకపోయినా ఎంత బాధపడిందో. అందరికీ తెలిసిందే కదా ఆడాళ్లు సున్నిత మనస్కులు. అల్పసంతోషులు అని. పుట్టినరోజు, పెళ్ళిరోజు అని పెద్దగా పార్టీలు చేయాల్సిన అవసరం లేదే? ఇది మీ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఎప్పుడు ఇంటిపనులు,ఆఫీసుపనులతో బిజీగాఉండే వాళ్ళు ఈ ఒక్కరోజు గుర్తుంచుకోవడం,కాస్త సరదాగా గడపడం అసాధ్యమేమీ కాదనుకుంటా. మగాళ్ళకి ఆఫీసుపని ఒక్కటే. ఆడాళ్ళకి ఎన్నోపనులు ఉంటాయి. ఇంట్లో ఉన్నా. కాని వాళ్ళకు ఎలా గుర్తుంటాయి. మీరంటే ఇష్టం, అమితమైన ప్రేమ కాబట్టి.

 

ఐనా ఈ పుట్టినరోజు, పెళ్ళిరోజు అన్నీ విదేశీ సంస్కృతులు . మనమెందుకు జరుపుకోవాలి అంటారా. తప్పేముంది. నష్టమేమీ లేదే. దీనివల్ల భార్యాభర్తలు మరింత దగ్గరవుతారు. ప్రేమలు పెరుగుతాయి. పిల్లలు ఉన్నారు , ముసలాళ్లయ్యాక ఇవన్నీ చేసుకోవాలా అంటారా. భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైనా ఈ విషయంలో ఇతరుల జోక్యమెందుకు? భయమెందుకు. నా ఈ రోజుల్లో పిల్లలే మనకు చెప్తున్నారు. ఎంజాయ్ అని.

 

దసరా,దీపావళి అని పండుగలు చేసుకుంటారు. కొత్తబట్టలు కొనుక్కుంటారు. మరి ఇవి కూడా ఎందుకు అలా చేసుకోరు. డబ్బులకేమీ ఇబ్బంది కాదే. ఏ దేవుడు మనని అడగలేదు నా పేరు మీద పండుగ చేసుకోండి అని. మరి భార్య అడిగినా ఎందుకు మర్చిపోయామని అంటారు. తనకి అంత విలువ లేదా. అలాగని భార్య మీద ప్రేమ లేదని నేననను. కాని అప్పుడప్పుడు ఆ ప్రేమను కాస్త వ్యక్తపరుస్తుండాలని. పెళ్ళి కాకముందు, పెళ్ళైన మొదటి సంవత్సరం మాత్రం భార్య పుట్టినరోజు గుర్తుంటుంది. పెళ్ళిరోజు కొన్నేళ్ళ వరకు మర్చిపోకుండా జరుపుకుంటారు. తర్వాతేమవుతుంది. ఎందుకు దానికి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వరు మొగుళ్ళు. ఈ విషయంలో ఆడాళ్ళు మాత్రం ఎదురుచూస్తూనే ఉంటారు. మర్చిపోరు.

 

దీనివల్ల ఎవరూ మారరూ. అని తెలుసు. ఇవన్నీ మావారితో జరిగిన రభస. ఇంకా అలాంటివారు ఎంతమంది ఉన్నారో అని రాస్తున్నా.

 

ఇక నా సంగతి చెబుతా. ఈ విషయంలో పెద్ద గొడవే జరిగింది. మొదటి పుట్టినరోజు మావారు కొత్తచీర, కేకు కొన్నారు.సినిమా,గుడికి వెళ్ళడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత నేను అడిగితే ప్రతీ సంవత్సరం గుడికివెళ్లడం జరిగేది. నాకు తెలిసినవాళ్ళు తమ మొగుళ్ళు పెళ్ళిరోజుకు ఆ చీర కొన్నాం ఈ చీర కొన్నాం అని చూపెడితే బాధపడి మావారితో గొడవ పెట్టుకుంటే ఒక్కసారి మాత్రం పెళ్ళిరోజు మరునాడు చీర కొనిచ్చారు. అదీ విసుక్కుంటూ. అంతే మళ్ళీ ఇప్పటికీ చీర అడగలేదు. ఒకటి రెండుసార్లు మాటల మధ్యలో పెద్ద చర్చ జరిగింది మాకు. పండుగలు చేయమని ఎవరు చెప్పారు. తద్దినాలు పెట్టమని ఎవరు చెప్పారు. పుట్టినరోజు, పెళ్ళిరోజు చేసుకుంటే ఏమవుతుంది అని నా వాదన. నాకు గుర్తుండదు,ఐనా ఎందుకు చేసుకోవాలి అని ఆయన అంటారు. ఇక విసుగొచ్చి మా పిల్లలముందే మావారికి చెప్పా. నేను బ్రతికున్నపుడు నాకు పుట్టినరోజు ఉంటుంది కనీసం పూలు కొనివ్వాలని గుర్తుండదు. నేను పోయాక గుర్తుపెట్టుకుని మరీ నాకు తద్దినం పెట్టొద్దు అని ఖచ్చితంగా చెప్పా. మా అబ్బాయికి కూడా చెప్పాను. నేను పోయాక నా పేరు మీద తద్దినం పెట్టి పనికిమాలిన చుట్టాలని పిలిచి భోజనం పెట్టేకంటే అదే డబ్బు akshayapatra కి , లేదా ఎవరైనా చదువుకునే విధ్యార్థికి ఇవ్వమని. తద్దినం పెట్టకుంటే నేను ఫీలవ్వను అని మావాడికి చెప్పా. ఆరోజునుండి నేను పెళ్ళిరోజు, నా పుట్టినరోజునాడు ఏమీ స్పెషల్స్ చేయను. పిల్లలు అడిగినా కూడా . వాళ్ళను బయట తినేయమని డబ్బులిస్తాను.. ఒకోసారి తిక్కరేగితే కూరలు కూడా చేయను. పప్పు చారు మాత్రమే చేసి పెడతా. ఆయన పుట్టినరోజునాడు మాత్రం ఎదో చేస్తాను, నాకు తోచిన బహుమతి ఇస్తాను. ఆయనకు గుర్తుండకపోతేనేమి, నేను మర్చిపోనుగా. ఆయనని సాధిద్దామని కాదు. కాని బాధ అనేది ఉంటుంది కదా. పాపం ఏమనుకున్నారో ఏమో కాని గత సంవత్సరం నా పుట్టినరోజు నాడు బయటకు తీసికెళ్ళి నాకిష్టమైన పుస్తకాలు కొనిచ్చారు. పెళ్ళిరోజునాడు చికెన్ తెచ్చి బిరియాని చేయమన్నారు. పిల్లలు ఒకటే నవ్వడం అది చూసి. వాళ్లకు తెలుసుగా మా పోట్లాటలు.

 

 

 

ఇలా అనుకునే పరిస్థితికి మీ భార్యకు రానివ్వకండి. అలా అని గ్రాండ్‍గా పార్టీ చేసుకోమనటంలేదు. గుర్తుంచుకుని తనని ఆనందపరచండి చాలు. నాకు తెలుసు మొగుళ్ళందరికీ గుర్తుంటాయి ఈ రోజులు కాని బద్ధకం. నిర్లక్ష్యం. కాని అదే తన భార్యని బాధపెడుతుందని ఆలోచించరు.

 

 

 

 

 

 

Comments on: "పెళ్ళైనవారికి మాత్రమే.." (20)

  1. దిన్నిపాటి said:

    బద్ద్కం, నిర్లక్ష్యం కాదు కాని జ్యోతక్కా… ప్రతియేడు గుర్తుండకపోవచ్చు కదా? ఆడవారికి ఎన్ని పనులున్నా ఇంట్లోవే కదా (అల్మోస్ట్) మగవాడికి ఎన్ని తిప్పలు? కానీ మీరు చెప్పిన విధానం చాల బావుంది. మా పెళ్లై రెండేళ్లె అయ్యింది. నా బెట్టర్ సగానికి ఎప్పుడూ ఇలాంటి ఆలోచన వచ్చేట్టు చేయలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి మరికొంచం జాగ్రత్తలు తీసుకొంటాను. అమ్మో లేకపోతే కూరలు కాదు ఇంకా ఏమేమి బంద్ అయిపోతాయో? ఏమంటారు?

  2. జ్యోతి గారికి ధన్యవాదాలు
    మీ బ్లాగు చదువుతుంటే ఈ నెలలో మాపెళ్ళి రోజువున్నదని గుర్తుకువచ్చింది.
    అనేక వత్తిడుల మద్య కట్టుబట్టలతో ఖైరతాబాదులో దిగిన రోజులు గుర్తుకొచ్చాయి.20 ఏళ్ళు పూర్తి అయ్యాయి. మేము మీరుచెప్పినట్టు పండగలు, పబ్బాలు, తద్దినాలు చేయలేదు గాని ఆర్థింకంగా నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాల మద్య బహుశ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకున్న గుర్తులేదు. పిల్లలు, రొగాలు, రొష్టులు, మారిన వుద్యోగాలు, మారిన అద్దె ఇళ్ళు వీటన్నిటి మద్య మాజంట పడిన వంటరిపోరాటం గుర్తుకువచ్చాయి.

  3. నా మనసుకు నచ్చిన blogs లో ఇది no.1 అని నిస్సందేహముగా చెప్పవచ్చును.నాకు ఈ రోజు కనువిప్పు కలిగింది.

  4. “అలాగని భార్య మీద ప్రేమ లేదని నేననను. కాని అప్పుడప్పుడు ఆ ప్రేమను కాస్త వ్యక్తపరుస్తుండాలని”…

    నిజమే, కానీ అదే పెద్ద సమస్య. మన సంస్కృతిలో వ్యక్తపరచటం అన్నది ఓ ఎబ్బెట్టు వ్యవహారంగా చాన్నాళ్ళ నుంచి ఉంది. ఏదో ఈ సినిమా ప్రభావాలవల్ల ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అలవడుతోంది.

  5. “నిజమే జ్యోతిగారు.
    ఎంతైనా భర్త గదా!
    అందుకని వారికి గుర్టువచ్హేలాగ, వారు ఆఫిసుకి వెళ్ళేటప్పుడు చిన్న హింట్ ఇస్తాను.
    మల్లీ అఫ్ఫిసుకి కూడా ఫోను చేసి హింట్ ఇస్తాను.
    ఆయన మరిచిపోకండా, ఆ సాయంత్రమ్ తొందరగా ఇంటికి చేరుకునేవారు.చక్కగా ఒక రెండు మూరల పువ్వులు తెచ్చిపెట్టేవారు.
    నా అనందం చూసి వారు చాలా సంతోషించేవారు!
    చీరలు వారికి గుర్తువచ్చినప్పుడు, నేను ఉహించనప్పుడు, నన్ను ఆస్చర్యపరిచే విధంగా కొనివ్చేవారు.
    పాపం ఒకొక్కసారి ఎక్కువ ధర పెట్టికొనేవారు. వారికి తెలియదుగదా! ఆరోజున కొంచెం భాద పదేదానిని.ఆనవసరంగా ఎక్కువ పెట్టి కొన్నారు కదా!
    కాని భలే సంతోషం వేసేది. నేను అడగకుండా కొనిచ్చేవారు కదా.
    ఏమిటో అదో తుత్తి!”
    – మా వారి పెళ్ళాం.
    🙂

  6. జాన్ గారు ,

    అందుకే ఇలాంటి చిన్ని చిన్ని సంతోషాలు భార్యాభర్తలను ఇంకా దగ్గర చేసి వారు కలిసి ఆనందంగా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కునేలా చేస్తాయని నా అభిప్రాయం.

  7. అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఎంతవరకూ నిజమో కానీ అడగంది మగాడు ఇవ్వడు అన్నది మాత్రం అక్షరాలా నిజమేమో. పెళ్ళితో భార్యను సాధించాము. ఇంక అక్కడితో ఆ సమస్యా పూరణం అయిపోయింది. ఇంక దాని (సమస్య) గురించి ఆలోచించమెందుకు అనుకుంటారు మగాళ్ళు. మైండ్ లో ఒక ఓపెన్ ప్రాసెస్ తో మగాళ్ళు నిద్రపోలేరు. దాన్ని బలవంతగా బజ్జో పెట్టాలి లేకపోతే ఆ ప్రాసెస్ కు ముగింపైనా పాడాలి. ఒక జన్మదినము కంటిన్యువస్ గా గుర్తుపెట్టుకోవటమనేది మగాడి బుర్రని తినేస్తుంది.
    ఆడాళ్ళకి టిప్: మీకు ముఖ్యమైన రోజుకు ముందు దాన్ని గుర్తుచేస్తూ మీ ఆయనకి SMS కొట్టండి. ఆ గిఫ్టుకంటే గుర్తు పెట్టుకోవటమే ముఖ్యం అని అడాళ్ళంటారు (అదేకదా మరి తంటా)

  8. బాగా వ్రాసారు. కానీ ఆమాత్రం తారీకులు గుర్తుంచుకోగలిగితే సోషల్లో 4 మార్కులెక్కువ తెచ్చుకుని ఉండేవాడిని… ప్చ్. :))

  9. ఊరికే సరదాకి ఒక జోక్

    “””02 October 2007
    బలి
    “ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం” చెప్పింది సుగుణ.

    “ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?” పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

    Posted by CH Gowri Kumar at 6:30 AM

    Labels: jandhyala_jokes
    “””
    courtesy: http://telugu-jokes.blogspot.com/2007/10/blog-post_02.html

  10. ఇది మావారికి చూపించాలి.చూడరు.నేనే చదివి వినిపిస్తాను.

  11. ఇలాటి టపాలు చదువుతుంటే నాకు చాలా హాశ్చర్యంగా ఉంటుంది. మాదంతా రివర్సుగేరు. మా ఆవిడ నాతో పందెం కడితే – “నువ్వు గెలిస్తే, నాకు గాజులు కొంటావట, నువ్వోడిపోతే పందెం ప్రకారం నాకు చీరకొంటావట” అంటుంది. ఈ మధ్యనే, మన పెళ్లయి ఇన్ని సంవత్సారాలయ్యిందిగదా, అప్పుడప్పుడు నేను కళ్ళు తుడుచుకోడానికైనా కనీసం ఒక రుమాలైనా నాకు కొనిచ్చావా అని నేను వాపోతే, ఒస్, రుమాలే కదా – ఈ సారి కొనిస్తాలే, దానికెందుకంత దుఖఃపడతావ్ అంటూ ఓదార్చింది కూడా…

  12. […] అలా ఇలా కాదు, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ! […]

  13. […] చదివా. అలా ఇలా కాదుట, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ […]

  14. కందర్ప కృష్ణమోహన్ said:

    నాకు సంబంధించి అక్టోబర్ 16 ఓ పేద్ద మలుపు..
    మొట్టమొదటి సారి మా ప్రియమైన బాబాయ్ ఐసీయులో గడిచిపోగా కిందటిసారి తను ఔట్‌డోర్.. ఈసారి (తనకే మళ్ళీ) టైఫాయిడ్.. ప్చ్.. నాబాధ ఏమని చెప్పను…
    అక్కాయ్.. ఏమంటావ్..

  15. నాకు పెళ్ళి ఇంకా కాలేదు కాని, ఈ పుట్టిన రోజులు మర్చిపోవటం నాకు చాలా భాధ కలిగించే విషయం. మిగతా విషయాలు గుర్తుంటాయి కాని, ఇవి మాత్రం గుర్తుండి చావవు. నాకొక చెల్లి వుంది. అదంటే నాకెంతో ఇష్టం. తన పుట్టిన రోజున విష్ చేద్దామని అనుకొంటా కాని, తీరా ఆ రోజు వచ్చేసరికి మర్చిపోతుంటా! ఈ విషయం తనకి కూడా తెలుసు కనక తను పెద్దగా ఫీల్ అయ్యేది కాదు. కానీ నాకే తనని ఎలాగైనా విష్ చేయాలనిపించేది. కొన్ని సంవత్సరాల క్రితం దీనికొక చిట్కా కనిపెట్టా! అదేమిటంటే, మా చెల్లి పుట్టిన రోజు ప్రొద్దున్నే మా అమ్మ నాకు ఆ విషయం గుర్తు చేస్తుంది. అప్పుడు నేను తనకి విష్ చేసి, గిఫ్ట్ (మధ్యలో ఎప్పుడన్నాగుర్తు వచ్చినప్పుడు ముందరే కొనేసి వుంచుతాలెండి) ఇస్తూ వుంటా! ఆడవాళ్ళకు ఈ విషయంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ అబిలిటీస్ వుంటాయని నాకు గట్టి నమ్మకం.

  16. నెను శుబ్రంగా Yahoo Calendar లో remainders పట్టుకుంటా ఎంచక్కా. I will get a remainder and an email
    నెనైతే నా శ్రీమతి పుట్టిన రోజుని easy గా గుర్తుంచుకుంటా. మాఇద్దరి పుట్టుక మా తల్లులు కూడబలుక్కుని కన్నట్లు ఒకే నెల లో. So, no problem మాములుగా ఆ రోజు చిన్ని domestic function and eat out వుంటాయి

  17. bahusa aham adduvostundomo

  18. జ్యోతి గారు ఇంత చిన్న విషయానికి అంతలా ఫీలయ్యారా ? ఫోని మీవారు గుర్తుంచుకోలేదు. మీకు గుర్తుంది కాదా ? మీ వారు పని ఒత్తిడిలో మరిచిపోయి ఉంటారు, ok ఫర్వాలేదు, దీనికి అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారేమోనని నా అభిప్రాయం…… మీ బ్లాగ్ నాకు చాలా నచ్చింది. ఈ రోజే చాట్ రూమ్ లో మీ బ్లాగ్ తెలుసుకున్నాను. అన్నీ తీరిగ్గా చదువుతాను …..

  19. Nijamae jyothi garu,
    Meeru cheppindi chala mandi aadavallaki jarigi vuntundi.jarugutunnadi kudanu.
    Yee magavaru antae.pelliki mundu meerae lokam antaru.pelli taruvata meeru tappa migilindi lokam antaru.ala ani manalni shoonyam loki padestaru.but manam discouraga avvakudadu.manamae vallani mana dariloki techhukovali.ala kadantae manam vall root lo veltae kachhitam ga vallu mana root loki vastaru.so don’t worry be happy.

వ్యాఖ్యానించండి