నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కనబడుట లేదు-2

                                      

 అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ దీక్షితులండి . ఎవరా అనుకుంటున్నారా ?? అదేనండి నెలక్రితం కనపడటంలేదు అని మా ఆవిడ ప్రకటన ఇచ్చింది వీరవెంకట అలమేలు మంగతాయారు. శాల్తీని నేనేనండి . ఇంటికొచ్చేసానండి. రాక   చస్తానా. అయినా ఎవడా అడ్డగాడిద అన్నది ఆడది ఇల్లుదాటితే మంచిది కాదు బయటకెళ్ళి బ్రతకలేదు అని .. అసలు పెళ్ళైన మగాడు ఇల్లొదిలి వెళితే అస్సలు బ్రతకలేడండి. నా స్వానుభవంతో చెప్తున్నా . ఇంట్లో మనశ్శాంతి లేదని వెళ్ళిపోతే పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి . అసలు మా ఆవిడ చెప్పిన విషయాల గురించిన నిజాలు, నేను పడ్డ కష్టాలు చెప్పుకుందామని ఇలా వచ్చాను. కాస్త ఊరట కలుగుతుందని.

 

* ఇంట్లో సీరియస్సుగా ఉంటాను అంటుంది. కాని తను ఎప్పుడు చూసినా టీ.వీ లో చెత్త సీరియల్స్ చూస్తూ అవి మా ఇంట్లోనే జరుగుతున్నంతగా లీనమైపోతుంది. ఎవరితో మాట్లడదు . పైగా వాటిగురించి ఇరుగుపొరుగమ్మలతో చర్చలు.

 

* ఎదో పెళ్ళయ్యిన కొత్తలో వండిన ప్రతీ చెత్త కూరలు బావున్నాయంటే ప్రతీరోజు చెప్పాలా . అసలే ఆఫీసుకెళ్ళే టెన్షన్ వంట బాగోకుంటే కోపం రాదా మీరే చెప్పండి. 

 

* తన పుట్టినరోజు , పెళ్ళిరోజు నాకెందుకు గుర్తుండవు . నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ,  ప్రతీ సంవత్సరం జేబుకు చిల్లు పెట్టుకుని మరీ గుర్తుచేసుకోవాలా. పైగా తన స్నేహితురాళ్ళతో పోల్చుకుని ఎవరి మొగుడెక్కువ ఖరీదైన చీర కొన్నాడనేగానీ నా ప్రేమను బేరీజు వేయరు .

 

* నా స్నేహితులతో మాట్లడతాను తనతో మాట్లాడను అంటుంది కదా , ఎప్పుడన్నా కాస్త సరసంగా మాట్లాడదామంటే ఫలానా ఆవిడా చీర కొంది , నెక్లేసు చేయించుకుంది , ఊరికెల్లారు , అవి కొన్నారు ఇవి కొన్నారు మనమెప్పుడు కొందాము అంటుంది. మీరే ఆలోచించండి ఇంట్లో ఉండబుద్దేస్తుందా??

 

* తనంటే నాకు ఇష్టమని ఎలా చెప్పనండి. పెళ్ళొద్దు మొర్రో అంటుంటే వినకుండా మేనమామ కూతుర్ని కట్టబెట్టారు . అది నాకు గౌరవమిస్తుందా అంటే అదీ లేదు. ఏం చేయను.

 

*  పెళ్ళై పదేళ్ళయింది. ఇంకా రుచిగా వండటం రాదు. ఏది నేర్చుకోవాలనే బుద్ధి ఉంటేగా. ఎదో పుస్తకంలోనో, టీ.వీ లోనో   చూసి ప్రయోగాలు చేస్తుంది. నేనూ మనిషినే కదా. ఎన్ని రోజులు ఆ అడ్డమైన గడ్డి తినను. ఇంత కష్టపడేది వేలకు వేలు సంపాదించేది తిండి కోసమే కదా?

 

*  బయటికెళ్ళి ఇంట్లోకి కావల్సిన సరుకులన్నీ తెచ్చిపడేస్తుంటే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి కదా మీరే చెప్పండి. తను కష్టపడి సంపాదిస్తే తెలిసేది డబ్బు విలువ. దానికి కోప్పడ్డం కూడా తప్పేనా? మహిళామండలి, మీటింగులు వాటిని నిర్వహించడం ఇలాంటివి బానే చేస్తుంది. మరి ఇంట్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అన్నీ నేనే చూసుకోనా ??

 

 

ఇవన్నీ గాక ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు వచ్చి ఎదో పేపర్ కటింగ్ తెచ్చి ఏవండి . మీరు కూడా బట్టతలమీద జుట్టు మొలిపించుకోండి. జస్ట్ పాతిక వేలంట. అంది. మళ్ళీ ఎదో సినిమా చూసొచ్చి నాకు ఆదివారం సెలవు కావాలి. ఇంట్లో పనంతా మీరే చేయాలి. మా కాలనీ మహిళామండలి వాళ్ళు నిర్ణయించారు అంది . అంతే తిక్కరేగి, కాస్త మనశ్శాంతిగా ఉంటుందని వెళ్ళిపోయా. కానీ అలా కూడా నన్ను బ్రతకనివ్వలేదు . పేపర్‍లో ప్రకటన ఇచ్చి  నా బ్రతుకు బజారు పాలు చేసింది. నేనున్న స్నేహితుడి పెళ్ళాం వాడికి వార్ణింగ్ ఇచ్చింది . నన్ను పంపేయమని. లేదా వాడిని కూడా నాతో పాటు బయటకెళ్ళమని.  బాస్ యెదవ పిలిచి మా ఆవిడ వచ్చి జీతం తీసికెళ్ళింది. బుద్ధిగా ఇంటికెల్లమని చెప్పాడు. మా అమ్మావాళ్ళకి ఫోన్ చేస్తే నన్నే తిట్టారు . ఐనా ఈ రోజుల్లో ఆడాళ్ళూ మరీ బరితెగించిపోయారు. మొగుడు ఉన్నా లేకున్నా అస్సలు భయం లేదు. ఇంక నాకు వేరే దిక్కు లేదు.దివాణం లేదు ..చచ్చినట్టు ఇంటికొచ్చా. పాపం చెప్పొద్దు . తాయారు నన్ను చూసి ఏడ్చేసింది. ఏవండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళద్దు. మీరు చెప్పినట్టు వింటాను అని .  కాని అది వారం వరకే. కథ మళ్ళీ మొదటి కొచ్చింది.

 

చీ యెదవ బ్రతుకు………ఆ దేవుడిని తన్నాలి అసలు. నన్ను మగాడిగా పుట్టించి ఇన్ని కష్టాల పాలు చేసినందుకు

Comments on: "కనబడుట లేదు-2" (1)

  1. ఎదవన్నర ఎదవ? అరై దీక్షితులు మమ్మల్నందర్రిని డీప్ షి ట్లో పడేసావుగదరా వెర్రి నాయాలా? ఎడవకురా.. ఎడవకురా. ఆరోజే అన్నాను పెళ్ళివొద్దురా అని. విన్నవా? చావు దరిద్రుడా? నీ బతుక్కి అదే కావాల్సింది. వాళ్ళెవరో నీలాంటి ఎడుపుగొట్టు మొగుళ్ళందరు కలిసి భార్యభాధిత సంఘం అని పెట్టుకున్నారంట.వెళ్ళి అందులో మెంబర్ షిప్పు కోసం దేవిరించు,అప్రాచ్యుడా. చిలక్కి చెప్పిన్నట్టు చెప్పాను..అరై మనకి పెళ్ళి పెటాకులకు దూరం రా. ఇంచక్కా సాయంత్రం ఎ సినిమా హాల్లొనొ, గుళ్ళోనొ, బజార్లోనొ ఎవత్తొ ఒక్కత్తి దొరక్కపోతుందాని? విన్నవా? అఘొరించు. వెధవా! మెరకవీధి మీదంటా వెల్తె, రూకలుపొతె పొయ్యాయి కుతి తీరుంది అని అన్నానా? విని చచ్హవా?

    ఏమిటి ఆ సంఘంవాళ్ళు సభ్యతం ఇవ్వనంటున్నరా?
    ప్రెసిడెంటుగారి సిఫార్సని చెప్పావా?
    ప్రెసిడెంటుగారెవ్వరా?
    నేనేరా?
    ఒళ్ళుబలిసికొట్టుకుంటునారల్లెవుందే?
    ప్రెసిడెంటుగారి పెళ్ళం తాయారమ్మ వస్తుంది అని చెప్పు ?
    ఇచ్హేసారా?
    తాయరమ్మ, మజాకా ఇవ్వకపోవడానికి.

వ్యాఖ్యానించండి