నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక తిరిగిచ్చేయాలి.

ముందుగా ఒక గృహిణి వచ్చింది…మరేనండి, మావారు నేను చెప్పిన మాట జవదాటరండి. జీతం రాగానే నా చేతికిచ్చి తన ఖర్చులకోసం మాత్రమే తీసుకుంటారు. నేను ఎంత ఖర్చు పెట్టినా ఏమనరు. మా ఇంట్లో అందరు నేను చెప్పిందే వేదం అంటారు. ( వాళ్ళాయన పచ్చి తాగుబోతు.సగం జీతం తాగుడు, అప్పులకే పోతుంది. సగం జీతంలోనే ఇల్లు గడవక మళ్ళీ అప్పులు. అంతా గోల గోల సంసారం)

ఇంజనీరింగు విద్యార్ధి…నేను చాలా సీరియస్సుగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. మంచి ఉద్యోగం సంపాదించాలి కదా.నాకు కాలేజీలో మంచి పేరుంది . జూనియర్స్ అందరు నన్ను ఎంతో గౌరవిస్తారు. డౌట్లన్నీ అడుగుతారు. (వీడస్సలు పుస్తకం ముట్టడు. పరీక్షలముందు ఆల్ ఇన్ వన్ కొనుక్కుని బట్టీ పడతాడు. ఎవరిని అడిగినా బండ బూతులు తిడతారు )

పనిమనిషి రాములమ్మ .. మరేనండి. నేను ఎవరింట్లో నన్నా పని పట్టుకున్నానంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. నలుగురున్న ఇల్లైతేనే చేస్తాను. జీతం ఐదొందలు. దసరాకి కొత్త చీర, నాలుగు పాత చీరలు , ఆదివారం పని చేయం. అందరు ఇంట్లోనే ఉంటారుగా చేసుకుంటారు. మేము కూడా ఇంట్లో టీవీలో సినిమాలు చూడొద్దేంటి. నెలకు రెండు సినిమాలు చూసే అలవాటు పనికి రాము. జ్వరం వస్తే కూడా పని చేయం. జీతం కట్ చేయొద్దు. అది బాలేదు ఇది బలేదు. అని అనొద్దు. మాట పడేదాన్ని కాదు.

క్లర్క్ శర్మ… మేము చాలా నిజాయితీగా పని చేస్తాము. తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా! ఏ పనైనా టైమ్ మీద పూర్తి చేస్తాము అయినా అందరూ మమ్మల్ని అపార్ధం చేసుకుంటారు.ఎంతైనా ప్రభుత్వోద్యోగులంటే అందరికీ అలుసే మరి..(సీట్లో కనిపించేది నెల మొదటిరోజు , ఎదైనా ఇన్స్పెక్షన్ ఉంటే . వెళ్ళేది పదకొండింటికి బయటపడేది నాలుగింటికే. ఇంట్లో చిట్టీల బిజినెస్ నడిపిస్తాడు మిగిలిన సమయంలో. ఆఫీసులో వచ్చే జీతం ,గీతం సరిపోదతనికి.

స్థానిక ఎమ్.ఎల్.ఏ … నా వార్డు ప్రజలే నాకు దేవుళ్ళండి. వాళ్ళ కోసం నా ఇంటి,ఫోను తలుపులు ఎప్పుడూ తెరిచేవుంటాయి. ఎప్పుడైనా ఏ సమస్య ఐనా నాకు చెప్పండి . వెంటనే స్పందించి ఆ సమస్య తీరుస్తాను. ఇది నా వాగ్ధానం. (ఏడిసినట్టుంది . అసలు ఎలక్షన్లప్పుడు, ఎదన్నా సన్మానం చేస్తామన్నప్పుడు తప్ప మళ్ళీ కనపడడు.)

ఇలా కొంతమంది గ్యాస్ కొట్టారు. సిలిండరు సగమే నిండింది. ఇక మీరు మొదలెట్టండి.ఎవరి గ్యాసుకు సిలిండరు నిండుతుందో వారికే అది సొంతం. ఖాళీ అయ్యాక సిలిండరు ఇచ్చేయాలండి మరి. హైదరాబాదులో గ్యాస్ సిలిండరు కెంత తిప్పలు పడాలో తెలిసిందే కదా! డబ్బులెట్టి బంగారం కొనడం సులువేమో గాని సిలిండరు దొరకడం అంత కష్టం.

తొలి ప్రచురణ పొద్దులో..

వ్యాఖ్యానించండి